గులాబ్ తుపాను (Cyclone Gulab) ప్రభావంతో జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచే ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లిలో 18.13 సెంటిమీటర్ల వర్షం కురవగా... ఖమ్మం జిల్లా వైరాలో 14.2 సెంటీమీటర్లు నమోదైందని వాతావరణశాఖ ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎడతెరిపి లేని వర్షానికి చాలాకాలనీలు జలమయమయ్యాయి. పాత బస్టాండ్, శాంతినగర్‌లో ఇళ్లలోకి నీరు చేరింది. కొత్తచెరువు మత్తడి దూకడంతో శాంతినగర్ అంబేడ్కర్‌నగర్ నీటమునిగింది.
సిరిసిల్ల-కరీంనగర్ రోడ్డులోని దుకాణాల్లోకి నీళ్లు చేరాయి. కలెక్టర్ అనురాగ్ జయంతి సహాయక చర్యల కోసం అధికారులను అప్రమత్తం చేశారు. 24 గంటలు అందుబాటులో ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ విభాగాల అధికారులు సమన్వయంతో సిరిసిల్లలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునారావస కేంద్రానికి తరలించారు. స్థానిక కౌన్సిలర్ల సమన్వయంతో అధికారులు స్వయంగా ప్రతి ఇంటికీ వెళ్లి అనవసరంగా బయటికి వెళ్లవద్దని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరో రెండురోజుల పాటు...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మత్తడివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో... లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రవాహం ఎక్కువైతే నీటి విడుదలకు అధికారుల నిర్ణయించారు. రెండ్రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్ పట్టణ శివారులోని బంగారుగూడ వాగు ఉప్పొంగడంతో వంతెన వరద నీటితో మునిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డి మండలం లింగాయిపల్లి మొండివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో కామారెడ్డి-రాజంపేట మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మాచారెడ్డి మండలం వాడి, పరిధిపేట్ గ్రామాల మధ్య లొట్టి వాగు జోరుగా ప్రవహిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వాతావరణశాఖ రెడ్‌అలర్ట్ ప్రకటించినందున మంత్రి ప్రశాంత్ రెడ్డి... అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుని వారికి పలు సూచనలు చేశారు. సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నీట మునిగిన పంటలు...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరు వానకు చెరువులు, కుంటలు, అలుగులు పారుతున్నాయి. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయి గూడెం మండలాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి సింగరేణి కాలరీస్‌లోని ఉపరితల బొగ్గు గనుల్లోకి వర్షపునీరు చేరడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. అశ్వాపురం మండలం మొండికుంట - భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచాయి. లోతు వాగు ఉప్పొంగడంతో సుమారు 16 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. భారీ వర్షాలకు ఖమ్మం నగర శివారులోని గొలుసుకట్టు వాగులు పొంగి పోర్లుతున్నాయి. వైరాలోని ఇందిరమ్మ కాలనీలో వరదనీరు పోటెత్తింది. ఏళ్లుగా ఇదే సమస్య ఉందని తమ బాధలు పరిష్కరించాలంటూ కాలనీ వాసులు ఆందోళన చేశారు. ఎడతెరిపిలేని వర్షాలతో ఇల్లందు నియోజక వర్గం పరిధిలోని పలు మండలాల్లో వందల ఎకరాల పొలాలు నీటమునిగాయి.