అమ్మానాన్న వస్తారని ఆశగా ఎదురుచూపులు. తలుపు చప్పుడైనప్పుడు గుమ్మం వైపు గమనించే పసికూనలు. ఆ చిన్నారులకు తెలియదు కనిపించకుండా పోయిన కన్నవారు.. ఇంకెన్నడూ కనిపించరని ఎవరూ ధైర్యం చేసి చెప్పలేరు. కరోనా కోరల్లో చిక్కి తల్లి/తండ్రి ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలు. ఆస్తులు, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు సాయం కోసం దిక్కులు చూస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల పల్లెలు, పట్టణాలంటూ తేడాలేకుండా కొవిడ్ వందలాది మందిని బలి తీసుకుంటోంది. ఇంటికి ఆధారమైన వ్యక్తులు దూరమైన పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. కన్నవారిని కోల్పోయి, అయినవారి ఆప్యాయతకు నోచుకోలేని చిన్నారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీన్ని అవకాశం చేసుకుని పిల్లల్ని దత్తత చేసుకుంటామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు పుట్టుకొచ్చాయి. సాయం చేస్తామంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్న మాయగాళ్లు పేట్రేగిపోతున్నారు.
రెండేళ్ల క్రితం అమ్మదూరమైంది. ఇటీవల కరోనా మహమ్మారి తండ్రిని మింగేసింది. ఏడో తరగతి చదువుతున్న బాలుడు(14) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బంధువులు సాకేందుకు ముందుకు రాలేకపోయారు. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి మానవత్వంతో స్పందించారు. పిల్లాడి వివరాలు మహిళా-శిశు సంక్షేమశాఖ అధికారులకు చేరవేశాడు. మరుసటిరోజే ఉన్నతాధికారులు స్థానిక అంగన్వాడీ టీచర్‌ను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి భరోసా కల్పించారు. గురుకుల పాఠశాలలో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- సంగారెడ్డి జిల్లాలో కన్నవారిని కోల్పోయిన బాలుడికి అందిన తోడ్పాటు
మేమున్నాం.. అక్కున చేర్చుకుంటాం
హైదరాబాద్ కేంద్రంగా చిల్డ్రన్ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. సహాయం కావాలంటూ వచ్చే ఫోన్‌కాల్స్‌ను జిల్లా, మండల, గ్రామస్థాయిలోని సిబ్బందితో సమన్వయం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు, ఇద్దరిలో ఏ ఒక్కర్నో కోల్పోయి నిస్సహాయంగా ఉన్న చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు చేర్చుతున్నారు. చదువుకు అవసరమైన సహకారం అందిస్తున్నారు. కన్నవారు దూరమై మనోవేదనతో బాధ పడుతున్న పిల్లలకు కౌన్సెలింగ్ ఇస్తూ సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అనాథ అనే భావన పసి హృదయాలను తాకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టంచేస్తున్నారు.