తెలంగాణ

telangana

ETV Bharat / state

Annapurna centers: నిరుద్యోగ యువత భోజన పాట్లు.. అన్నపూర్ణ కేంద్రాల కోసం వినతులు - annapurna centres in hyderabad

Annapurna centers: పోటీపరీక్షలకు సన్నద్దమయ్యేందుకు ఇప్పటికే నిరుద్యోగ యువత నగరబాట పట్టారు. హైదరాబాద్​తో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో శిక్షణ పొందుతున్నవారికి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. బయట భోజనం చేయాలంటే రోజుకు వందకుపైగా వెచ్చించాల్సి వస్తోంది. దీనికి అదనంగా అద్దె గదులతో మరింత భారం పడుతోంది. హైదరాబాద్​లో శిక్షణ కేంద్రాలు ఉండే ప్రాంతాల్లో రూ.5కే భోజనాన్ని అందించే అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువకులు కోరుతున్నారు.

Annapurna centres
అశోక్​నగర్​లో తెరుచుకోని అన్నపూర్ణ కేంద్రం

By

Published : Apr 4, 2022, 10:34 AM IST

Annapurna centers: పోటీ పరీక్షల కోసం రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాలలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు భోజన ఖర్చులు భారంగా మారుతున్నాయి. బయట తినాలంటే రోజుకు రూ.100కు పైగా ఖర్చు పెట్టాల్సిందే. ఒకవైపు కోచింగ్‌ సెంటర్ల ఫీజులు.. మరోవైపు హాస్టల్‌ గదుల అద్దెలు తలకుమించిన భారం కాగా.. భోజనానికి అవస్థలు పడుతున్నారు. టీఎస్‌పీఎస్‌సీ వద్ద సుమారు 26 లక్షల మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 571 వరకు వివిధ రకాల గ్రంథాలయాలున్నాయి. నిరుద్యోగ అభ్యర్థుల్లో సుమారు 1.50 లక్షల నుంచి 2 లక్షల మంది వరకు ఆయా లైబ్రరీలపై ఆధారపడి సన్నద్ధమవుతున్నారని అంచనా. రాజధానితో పాటు వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లా కేంద్రాల్లో ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారు.

హైదరాబాద్‌లో అశోక్‌నగర్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో కోచింగ్‌ కేంద్రాలు ఎక్కువ. అక్కడ రూ.5కే భోజనాన్ని అందించే అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువకులు కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అవి నడుస్తున్నా.. సరిపోవడంలేదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలమంది అభ్యర్థులు కోచింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. అలాగే హనుమకొండకు కూడా గ్రామాల నుంచి అభ్యర్థులు చేరుకొని గదులు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వారు హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా గ్రంథాలయమే వేదికగా సన్నద్ధమవుతున్నారు. ఇక్కడో భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. కాగా హనుమకొండలో మహానగరపాలక సంస్థ ఇప్పటికే సుమారు పది రూ.5 భోజన కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఇంకా నిజామాబాద్‌ ప్రాంతీయ కేంద్ర గ్రంథాలయం వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ‘కేసీఆర్‌ బువ్వ కుండ’ పేరిట మధ్యాహ్నం 300-400 మందికి భోజనం అందిస్తున్నారు.

రాత్రి పూట కొనసాగిస్తే మేలు :ప్రస్తుతం రూ.5 భోజన కేంద్రాలు మధ్యాహ్నమే పనిచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌లో రెండు పూటలా భోజనం అందించినా.. తర్వాత ఒకపూటకే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో రాత్రిళ్లు భోజనం ఏర్పాటు చేస్తే అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటుంది.

  • అశోక్‌నగర్‌లో పెద్దసంఖ్యలో కోచింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ లాక్‌డౌన్‌ సమయంలో ఏర్పాటుచేసిన అన్నపూర్ణ కేంద్రాన్ని ప్రస్తుతం తెరవడంలేదు. అభ్యర్థులు భోజనానికి ధర్నాచౌక్‌, చిక్కడపల్లి గ్రంథాలయం వరకు వెళుతున్నారు. అశోక్‌నగర్‌ కోచింగ్‌ సెంటర్ల వద్ద ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
  • అమీర్‌పేటలోని సత్యం థియేటర్‌, ఎస్‌ఆర్‌నగర్‌ బస్టాపు వద్ద ఒక్కో అన్నపూర్ణ కేంద్రం ఉన్నాయి. మైత్రివనం ప్రాంతంలో మరొకటి ఏర్పాటు చేయాలనిఅభ్యర్థులు కోరుతున్నారు.
  • దిల్‌సుఖ్‌నగర్‌లో వెంకటాద్రి థియేటర్‌ సమీపంలో రూ.5 భోజన కేంద్రం ఉంది. ఈ పరిసరాల్లో మరొకటి ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు.

భోజనానికి ఇబ్బంది పడుతున్నాం : "మాది దుగ్గొండి మండలం కేశవాపురం. ప్రస్తుతం హనుమకొండలో గది అద్దెకు తీసుకొని సిద్ధమవుతున్నా. ఉదయం అయిదున్నరకే గ్రంథాలయానికి వచ్చి రాత్రి వరకు ఉంటున్నాం. భోజనానికి ఇబ్బంది అవుతుంది. మాకోసం లైబ్రరీ సమీపంలో రూ.5 భోజన కేంద్రం ఏర్పాటు చేయాలి."

- -కరుణాకర్‌, హనుమకొండ

ఇవీ చూడండి:MahaBrand Skotch Award: స్కోచ్ పురస్కారం కోసం పోటీపడుతోన్న 'మహాబ్రాండ్'

ఇన్నాళ్లు ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు.. ఇప్పుడు పుస్తకాల్లేవు

ABOUT THE AUTHOR

...view details