నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయడాని భాజపా సిద్ధమైందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... పదాధికారులతో, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జ్‌లతో నిర్వహించిన సమావేశంలో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగుల పక్షాన భాజపా అండగా ఉంటుందని పేర్కొన్నారు. యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. యువకుల పక్షాన పోరాటం చేయడాని సబ్బండ వర్గాలను కలుపుకుని ... ఈనెల 12న నిరుద్యోగుల మిలియన్ మార్చ్, 21న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. నవంబర్ 12న యువకులంతా హైదరాబాద్‌కు భారీ ఎత్తున యువత తరలిరావాలని కోరారు. మిలియన్ మార్చ్‌కు సంబంధించి ఈనెల 6, 7 తేదీల్లో జిల్లా సమావేశాలు, 8, 9 తేదీల్లో నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర...
నవంబర్ 21 నుంచి జనవరి 10 వరకు 50 రోజులు రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తామని పాదయాత్ర ఇంఛార్జ్ మనోహర్ రెడ్డి తెలిపారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందన్నారు. ఒకటి రెండు రోజుల్లో పాదయాత్ర పూర్తి వివరాలు, రూట్ మ్యాప్ వెల్లడిస్తామని తెలిపారు. 2022 డిసెంబర్ నాటికి పూర్తి పాదయాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు.