Umamaheswari Funerals: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (57) సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉమామహేశ్వరి అంత్యక్రియలను నేడు మహాప్రస్తానంలో నిర్వహించనున్నట్లు ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ తెలిపారు. తమ గారాలపట్టి.. ముద్దుల చెల్లి ఉమా మహేశ్వరి స్వర్గస్తులవ్వడం బాధాకరమని రామకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిందని ఉద్వేగానికిలోనయ్యారు. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఆమె భర్తతో కలిసి ఉంటున్నారని.. విశాల కడసారి తన తల్లిని చూసుకునేందుకే అంత్యక్రియలను ఆపినట్లు తెలిపారు. ఆమె రాగానే అంత్యక్రియల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.
ఉమా మహేశ్వరి పార్థీవ దేహానికి మంత్రులు తలసానిశ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావులు నివాళులు అర్పించారు. ఉమా మహేశ్వరి చనిపోవడం బాధాకరమని ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని మంత్రులు పేర్కొన్నారు. చిన్న కూతురు అంటే ఎన్టీఆర్కు అత్యంత ఇష్టమన్నారు. దేవుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు.