'అక్టోబర్, నవంబర్‌లో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు' Ugadi Celebrations at Ravindra Bharati in Hyderabad: హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో.. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాచంపల్లి సంతోశ్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ప్రభుత్వం సుస్థిరంగా పని చేస్తుందని, ప్రజా ప్రయోజన కార్యక్రమాల రూపకల్పన చేస్తుందని శాస్త్రి చెప్పారు. ఆగిన పనులు, బిల్లుల పేమెంట్ సహా అన్ని పనులు పూర్తి అవుతాయన్నారు.
ప్రభుత్వంలో సొంత వర్గంలోనే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందన్నారు. రాజు సమర్థుడు కావడం వల్ల వ్యతిరేకతను అణచివేసే అవకాశం ఉంటుందన్నారు. కాళేశ్వరం నిండుగా ఉంటుందన్న సంతోశ్ కుమార్ శాస్త్రి.. అన్ని డ్యామ్‌లలో నీరు సమృద్ధిగా చేరుతుందన్నారు. రాష్ట్రం పాడి పంటలతో విరాజిల్లుతుందని తెలిపారు. ప్రభుత్వానికి రుణాలు చేయాల్సిన అవసరం ఉంటుందని వెల్లిడించారు. ఈ ఏడాది విద్యార్థులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకుగానూ అవకాశాలు, పరిశోధనలు పెరుగుతాయని స్పష్టం చేశారు. విద్యారంగంలో సమూల మార్పులకు అనుకూలంగా ఉందని తెలిపారు.
అక్టోబర్, నవంబర్లలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు: ఇందులో కొన్ని అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయని, రుణాలు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడబోతుందని వివరించారు. ధార్మిక వ్యవస్థ బాగుపడుతుందని.. తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి పథంలో సాగుతోందని చెప్పారు. న్యాయవ్యవస్థ చక్కని తీర్పులు ఇస్తుందని.. ప్రతి పక్షాల ఉనికికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి రాబోతుందన్నారు. ప్రకృతి ఉపద్రవాలు, మత కలహాలు తలెత్తే అవకాశం ఉందన్న శాస్త్రి.. ఉత్తర భారతదేశంలో అగ్ని ప్రమాదాలు రానున్నాయని తెలిపారు. రానున్న అక్టోబర్, నవంబర్లలో తెలంగాణలో రాజకీయాల్లో కీలక మార్పులు రానున్నాయని చెప్పారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు పుష్కలం: ప్రజలు ఆశ్చర్యకర ఘటనలు చూస్తారన్నారు. పోలీస్, రక్షణ శాఖ సమర్థంగా పని చేసి శాంతి భద్రతలు కాపాడతారన్నారు. పాడి పరిశ్రమ బావుంటుందని.. కానీ కల్తీ ఎక్కువగా పెరుగుతుందని, ఆహారంలో కూడా కల్తీ పెరుగుతుందని పేర్కొన్నారు. ఆగష్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు తుపానులు వస్తాయని హెచ్చరించారు. ఈ ఏడాది గంగానదికి పుష్కర కాలం వస్తోందన్నారు. కొత్త విశ్వ విద్యాలయాలు, ఉద్యోగ నియామకాల్లో కొన్ని ఒడిదుడుకులపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు పుష్కలంగా వస్తాయన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మరోమారు అంర్జాతీయ ఖ్యాతి లభిస్తుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: