తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓ క్యాబ్​ డ్రైవర్​కు వింత సమస్య.. అదేమిటంటే..! - తెలంగాణ తాజా వార్తలు

గుండు చేయించుకున్న వెంటనే ఆ వ్యక్తిని గుర్తుపట్టలేకపోవచ్చు. అప్పటి వరకు పరిచయమున్న వారే కొద్దిసేపు తడబడతారు. కానీ గుండు చేయించుకోవడం వల్ల ఉపాధి కోల్పోయాడు. ఇంతకీ ఏమయింది. అతనికి వచ్చిన ఈ వింత కష్టము ఏమిటి అనుకుంటున్నారా.. అయితే మీరే చూడండి.

uber cab driver
uber driver, face not recognise

By

Published : Apr 2, 2021, 7:46 AM IST

గుండుతో విధుల్లో చేరేందుకు సిద్ధమైన ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. అతడి ముఖాన్ని ఉబర్‌ యాప్‌ గుర్తుపట్టకపోవడంతో ఉపాధికి దూరమయ్యాడు. ఈ వింత ఘటన హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్‌ శ్రీకాంత్‌కు ఎదురైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకున్న అతడు.. ఫిబ్రవరి 27న పలుమార్లు సెల్ఫీతో లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. దీంతో నాలుగోసారి మళ్లీ ప్రయత్నిస్తే అతడి ఖాతా పూర్తిగా బ్లాక్‌ కావడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. దాదాపు ఏడాదిన్నరగా ఉబర్‌లో పనిచేస్తున్న అతడు ఇప్పటివరకు 1428 ట్రిప్‌లతో 4.67 స్టార్‌ రేటింగ్‌తో ఉన్నాడు. తనకు ఎదురైన ఇబ్బందిపై ఆవేదన వ్యక్తంచేశాడు.

‘‘తిరుమల నుంచి వచ్చాక నా ఉబర్‌ ఖాతాలో లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తే తలపై జుట్టు లేకపోవడంతో యాప్‌ నన్ను గుర్తించలేదు. నా ఖాతా బ్లాక్‌ అయింది. మరుసటి రోజు ఉబర్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. నా కారుకు వేరే డ్రైవర్‌ను పెట్టుకోవాలని సూచించారు. కానీ, నేను అంత భరించలేను. నెల తర్వాత మళ్లీ ఉబర్‌ కార్యాలయానికి పలుమార్లు తిరిగితే.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు ఒక ఈ-మెయిల్‌ ఐడీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఇంకా ఆ వ్యవహారం నడుస్తూనే ఉంది’’ అని వాపోయాడు.

శ్రీకాంత్‌కు డ్రైవింగే జీవనాధారమని యాప్‌ ఆధారిత ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్ల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి షేక్‌ సలాయుద్దీన్‌ తెలిపారు. అతడి కారుకు ఈఎంఐ కూడా చెల్లించాల్సి ఉందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో డ్రైవర్లంతా ఖాళీగానే తిరగాల్సి వచ్చిందని, కొన్ని సందర్భాల్లో అల్గారిథమ్‌ డ్రైవర్ల ముఖాల్ని గుర్తించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గ్రీవెన్స్‌ కోసం సమర్థమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. శ్రీకాంత్‌కు ఎదురైన ఇలాంటి సమస్య మరో డ్రైవర్‌కు ఎదురవ్వకూడదని తెలిపారు.

ఇదీ చూడండి:శంషాబాద్ విమానాశ్రయంలో కిలోకిపైగా బంగారం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details