UAE Consulate Inauguration In Hyderabad : హైదరాబాద్‌లో యూఏఈ కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది. ఇక్కడ ఉండే అరబ్ దేశాల పౌరులకు వివిధ సేవలు అందించడంతో పాటు.. ఆ దేశానికి వెళ్లే వాళ్లకు వీసాలు జారీ చేస్తుంది. ఇందుకోసం సిద్ధమవుతున్న హైదరాబాద్ యూఏఈ కాన్సులేట్ భవనం జూన్ 14వ తేదీన ప్రారంభం కానున్నట్లు యూఏఈ కాన్సులేట్ జనరల్ ఆరేఫ్ అలీ అల్తాబూర్ అల్నుయిమి తెలిపారు.
వీసాలను జారీ చేసేందుకు :భారత్‌తో యుఏఈ సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఇది దోహదం చేస్తోంది. వివిధ అవసరాల నిమిత్తం రోజు రోజుకు భారత్ నుంచి అరబ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరో వైపు యూఏఈ-భారత్‌ల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఈ కాన్సులేట్ కార్యాలయం అటు యూఏఈ పౌరులకు, ఇటు భారతీయులకు అనేక సేవలను అందించనుంది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని యూఏఈ పౌరుల భద్రతను నిర్ధారించేందుకు అవసరమైన డాక్యుమెంటరీ సహాయం అందించేందుకు, ఇతర సేవలను కూడా ఇది అందిస్తుంది. అదేవిధంగా భారతీయ పౌరులకు వీసాలు కూడా మంజూరు చేస్తుంది.
ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలకు : ద్వైపాక్షిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలతోపాటు యూఏఈ ప్రయోజనాలను ప్రభావితం చేసే సమస్యలపై భారత అభిప్రాయాలను యూఏఈ ప్రభుత్వానికి నివేదిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు యూఏఈ ఎగుమతుల విస్తరణను ఇది ప్రోత్సహిస్తుంది. బహిరంగ మార్కెట్లను సమర్థిస్తుంది. వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసి, వ్యాపారాలకు సహాయం చేస్తుంది. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, విద్యా మార్పిడిని మరింత సులభతరం చేస్తుంది.