Naffco 700 Hundred Crore Investment in Telangana : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వివధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో రూ.700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు యూఏఈకి చెందిన దిగ్గజ సంస్థ నాఫ్కో ముందుకొచ్చింది. అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. దుబాయ్ పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్.. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
KTR Dubai Tour Latest News: అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్, ప్రతినిధి బృందం కేటీఆర్(KTR)తో సమావేశమైంది. తెలంగాణలో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారు చేయనున్నట్లు తెలిపిన సంస్థ.. ఇందులో భాగంగా రూ.700 కోట్ల భారీ పెట్టుబడిపెడుతున్నట్లు తెలిపింది. తెలంగాణతో పాటు భారతదేశం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సామాగ్రి, అగ్నిమాపక సేవల అవసరం రానున్న భవిష్యత్తులో భారీగా పెరుగుతుందన్న విశ్వాసం తమకుందని నాఫ్కో తెలిపింది.
Naffco CEO Speech about Telangana: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్ భారతదేశ డిమాండ్‌కు సరిపోతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రానికి చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు. దీనికి నాఫ్కో(Naffco) కంపెనీ అంగీకారం తెలిపింది. అకాడమీ ద్వారా దాదాపు వందకు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ సీఈవో తెలిపారు.
Lulu Group Organization Investment in Telangana : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ప్రముఖ లులూ గ్రూప్ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో దుబాయ్‌లో లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, ప్రతినిధి బృందం సమావేశమైంది. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో పాటు షాపింగ్ మాల్స్, రిటైల్ రంగంలో కొనసాగుతున్న కార్యకలాపాలను యూసుఫ్ అలీ మంత్రి కేటీఆర్‌కి వివరించారు. సిరిసిల్ల జిల్లాలో రానున్న ఆక్వా క్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ముందుకు వచ్చింది. ప్రతి ఏటా సుమారు రూ.1000 కోట్ల ఆక్వా ఉత్పత్తులను ఈ ప్రాంతం నుంచి సేకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి అవసరమైన కోల్డ్ స్టోరేజీ, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఈ ప్రాంతంలో 500 మందికి నేరుగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు.