ఈ చిన్నారి పేరు అక్షిత్. వయసు రెండేళ్లే... ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. జ్ఞాపకశక్తి మాత్రం అద్భుతం. ఒక్కసారి చెప్పడమే ఆలస్యం దేన్నైనా ఇట్టే గుర్తుపెట్టుకుంటాడు. వివిధ దేశాల జాతీయ పతాకాలను గుర్తు పడతాడు. దేశ రాజధానుల పేర్లను అవలీలగా చెప్పేస్తాడు. ఏదైనా ఒక్కసారి చూశాడా...? విన్నాడా... అంతే... ఎప్పుడైనా ఎక్కడైనా దాని గురించి వివరిస్తాడు. ప్రముఖుల చిత్రాలను చూసి వారి పేర్లూ చెప్పేస్తాడు. క్లిష్టమైన రసాయన సమీకరణాలు సైతం చెప్పి అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. ఇరవై నెలల వయసులోనే జనరల్ నాలెడ్జ్‌లో ప్రతిభ కనబరిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి అరుదైన రికార్డ్స్‌ను సొంతం చేసుకున్నాడు అక్షిత్.
విజయవాడ అయ్యప్పనగర్‌లో నివాసముంటున్న మురళీకృష్ణ, శిరీష దంపతుల కుమారుడు అక్షిత్. తండ్రి బ్యాంక్ మేనేజర్. తల్లి గృహిణి. ఏడాదిన్నర వయసులోనే అక్షిత్లోని ఈ ప్రత్యేక నైపుణ్యాన్ని తల్లి శిరీష గుర్తించింది. బాలుడి ప్రతిభకు శిక్షణతో మరింత మెరుగు పెట్టిందామె. తన కుమారుడు శాస్త్రవేత్త కావాలని కోరుకుంటున్నానని శిరీష ఆశాభావం వ్యక్తం చేసింది. చిన్నతనంలోనే ఇంతటి అద్భుత ప్రతిభ కనపరుస్తున్న తమ కుమారుడ్ని చూసి ఎంతో గర్వంగా ఉందని తండ్రి మురళీకృష్ణ చెపుతున్నారు.