ఆనందంగా సాగిపోతున్న కుటుంబాల్లో కరోనా పెను విషాదాన్ని నింపుతోంది. కొన్ని కుటుంబాల్లో కనీసం ఇద్దరు.. ముగ్గురు మరణిస్తున్నారు. అది కూడా.. కొన్ని గంటల వ్యవధిలోనే. ఒకరి అంత్యక్రియలు పూర్తయ్యాయో లేదో.. మరొకరి మరణ వార్త వినాల్సిన విషాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనివల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. లాక్‌డౌన్ పెడతారేమో అన్న భయంతో ఓ వృద్ధ దంపతులు కొడుకు ఇంటికి వెళ్లగా అక్కడ కుమారుడితో సహా వారూ మహమ్మారికి బలయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం గుండన్నపల్లిలో చోటుచేసుకున్నదీ దుర్ఘటన. ఆయనదో చిన్న కిరాణాకొట్టు. కొద్దిరోజుల ముందే ఊరి నుంచి తల్లిదండ్రులు వచ్చారు. కుటుంబ యజమానికి కొవిడ్ అని తేలడంతో భార్య కరీంనగర్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన చికిత్స, ఆసుపత్రి ఫీజుల కోసం ఆమె ఆందోళన చెందుతుండగా అత్తామామలకూ కరోనా అన్న పిడుగులాంటి వార్త తెలిసింది. వారిని మరో ఆసుపత్రిలో చేర్పించారు. ఏప్రిల్ 28న ఉదయం అత్త(70), సాయంత్రం భర్త మరణించారు. ఆ దుఃఖం నుంచి తేరుకోలేదు. ఆసుపత్రి నుంచి వచ్చిన మామ (80) నాలుగురోజులకే మరణించారు. కరోనా చికిత్స కోసం రూ. 8.60 లక్షల వరకు అప్పు చేశారు. అప్పటికే పలువురి నుంచి అప్పులు తెచ్చి ఇటీవల చిన్న ఇల్లు కట్టుకున్న ఆ కుటుంబానికి.. వైద్యకోసం చేసిన అప్పులు కూడా కలిపి పెనుభారంగా మారాయి.
మూడున్నర గంటల్లోనే తల్లి, కుమారుడు
*మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడకు చెందిన తల్లి.. కుమారుడు మూడున్నర గంటల వ్యవధిలోనే మరణించారు. ఈనెల 7న ఉదయం 9.30కి గౌసియాబేగం (55), మధ్యాహ్నం ఒంటి గంటకు ఆమె కుమారుడు తాజుద్దీన్ (35) మరణించారు.
*మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పరిపల్లికి చెందిన అన్నదమ్ములు నాగేశ్ (45), నర్సింహం (37) ఈ నెల 7న ఉదయం కొన్ని గంటల తేడాతోనే మరణించారు.
24 గంటల్లోపే అన్నదమ్ములు...
జగిత్యాల జిల్లా చల్గ్‌ల్ గ్రామంలో ఎర్ర రాజేశం (55), ఎర్ర రమేశ్ (48) ఇద్దరు అన్నదమ్ములు. వేర్వేరుగా కిరాణ దుకాణాలు నిర్వహించుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు. కరోనా సోకి హోమ్ ఐసొలేషన్‌లో చికిత్స తీసుకుంటూ రాజేశం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన తమ్ముడు రమేశ్ కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇద్దరి మరణాల మధ్య వ్యవధి 24 గంటలలోపే.
*నిర్మల్ జిల్లా కడెం మండలంలో పాతమద్దిపడగలో ఒకే కుటుంబంలో ముగ్గురు సోదరులు రోజుల వ్యవధిలో కరోనా కాటుకు బలయ్యారు. ఇదే కుటుంబంలో మరో సోదరుడు భార్య కూడా మరణించింది.
19న అమ్మాయికి పెళ్లి చేయాల్సి ఉండగా...
సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన ఆర్‌ఎంపీ కిష్టయ్య (50) ఏప్రిల్ 20న కరోనా బారిన పడటంతో ఇంట్లోనే మందులు తీసుకుంటున్నారు. 24న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో తెల్లవారుజామున 3 గంటలకు బంధువులు హైదరాబాద్ తరలించారు. అంబులెన్స్‌లోనే 7 గంటలు తిప్పారు. బెడ్డు దొరకలేదు. చేసేదిలేక హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి తీసుకెళ్లారు. అతి కష్టమ్మీద ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చుకున్నారు. కొద్దిసేపటికే మరణించారు. భార్య అనసూజ(48)కూ పాజిటివ్‌గా తేలింది. ఇంట్లోనే రెండ్రోజులు మందులు వాడారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో తర్వాత సంగారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. నాలుగు రోజులు పోరాడి మే 1న మరణించారు. వీరి చికిత్సకు రూ.ఆరు లక్షల ఖర్చయ్యింది. సమీప బంధువులే తెలిసిన వారి దగ్గర అప్పులు తెచ్చి ఆసుపత్రిలో చెల్లించారు. వీరికి నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు అయ్యాయి. నాలుగో అమ్మాయి పెళ్లి ఈ నెల 19న జరగాల్సి ఉంది.