రాష్ట్ర శాసనమండలిలో త్వరలో భర్తీ కానున్న రెండు స్థానాలకు అధికార తెరాస నుంచి భారీఎత్తున ఆశావహులు ఉన్నారు. ఇందులో ఒకటి నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గంకాగా.. మరొకటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి. వీటిని సీనియర్ నేతలు ఆశిస్తున్నారు. వివిధ వర్గాల వారు సైతం ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ రెండు పదవులకు అర్హులెవరనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాచారం సేకరిస్తున్నారు.
మండలిలో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి త్వరలో షెడ్యూల్ వెలువడనుంది. ఈ స్థానానికి ఏడాది మాత్రమే గడువు ఉంది. స్థానిక సంస్థల్లో పూర్తి ఆధిక్యం దృష్ట్యా తెరాసకు ఈ స్థానం దక్కడం ఖాయం. జిల్లాకు చెందిన మాజీ సభాపతి కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముజీబ్ తదితరుల పేర్లు ఈ పదవికి పరిశీలనలో ఉన్నాయి.
సురేశ్‌రెడ్డి రాజ్యసభ స్థానాన్ని సైతం ఆశిస్తున్నారు. రాజ్యసభ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే మండలికి ఆయన పేరును ప్రతిపాదించే వీలుంది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా పరిశీలనకు వచ్చినా ఆయన ఆసక్తి చూపడం లేదని తెలిసింది.