తెదేపా నేత పట్టాభి అరెస్టు(TDP leader Pattabhi arrest) సమయంలో నిబంధనలు సరిగా పాటించలేదని పోలీసుల తీరును న్యాయమూర్తులు తప్పుపట్టిన నేపథ్యంలో ఇద్దరు అధికారులపై(Two policemen transferred) బదిలీ వేటు పడింది. నగర కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏసీపీ రమేష్, సీఐ నాగరాజు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. అరెస్టు సమయంలో ఖాళీలతో 41 (ఏ) సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చినందునే వీరి బదిలీ జరిగినట్లు సమాచారం.
సీఎంను దూషించిన కేసులో..
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను దూషించిన కేసులో గవర్నర్‌పేట పోలీసులు ఈ నెల 20న పట్టాభిని అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. 21న మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఖాళీలతో ఉన్న నోటీసు ఇవ్వడంపై మేజిస్ట్రేట్ అభ్యంతరం చెప్పారు. దీనిపై విచారణ అధికారిగా ఉన్న గవర్నర్‌పేట సీఐని వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. హైకోర్టులో వాదనల్లోనూ ఇదే విషయంపై పోలీసులను న్యాయమూర్తి తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే బదిలీ చేసినట్లు తెలిసింది.