కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఇంధన నిల్వ విధానంలో భాగంగా రెండు పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో 1,600 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో 500 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీ పార్కులను స్థాపించనుంది. కొత్త విధానం ద్వారా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా కొత్త పార్కుల ఏర్పాటు కోసం మంత్రి కేటీఆర్.. పరిశ్రమలు, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) అధికారులతో ఇటీవల చర్చించారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు అనువైన స్థలంగా చందన్‌వెల్లిని ఎంపిక చేశారు. చందన్‌వెల్లి-హయతాబాద్-సీతారామ్‌పూర్ గ్రామాల మధ్య ఈ స్థలం ఉంటుంది. హైదరాబాద్‌కు, అంతర్జాతీయ విమానాశ్రయానికి, జాతీయరహదారికి చేరువగా ఉన్న ఈ స్థలం అన్ని విధాల పారిశ్రామిక వర్గాలకు అనుకూలమని ప్రభుత్వం భావిస్తోంది.
మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లిని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, ఇతర అనుబంధ పరికరాల తయారీ పార్కు ఏర్పాటుకు గుర్తించారు. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలోని ఈ స్థలం అందుబాటులో ఉంది. ఇదీ రాజధానికి, విమానాశ్రయానికి, జాతీయరహదారికి చేరువగా ఉండడంతో మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. వీటిల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రోడ్లు, విద్యుత్తు, నీరు తదితర మౌలిక సదుపాయాల కల్పన.. చిన్న పరిశ్రమలకు షెడ్లు, ఉమ్మడి సౌకర్యాల కేంద్రాలు, వ్యర్థాల శుద్ధి కేంద్రం, ప్రదర్శన-అమ్మకం కేంద్రాలు, శిక్షణ, లాజిస్టిక్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో అయిదు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ సంస్థల ప్రతినిధులకు త్వరలో చందన్‌వెల్లి, దివిటిపల్లిలోని భూములను ప్రభుత్వం చూపించనుంది. వారు సమ్మతిస్తే భూకేటాయింపులు జరుపుతారు.