వ్యవసాయరంగానికి మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరొకటి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అనేక చర్యలు తీసుకుంటూ.. రాష్ట్ర సాగు ముఖచిత్రమే మార్చామని తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సహా ఉన్నతాధికారులతో వ్యవసాయరంగంపై సీఎం సమీక్షించారు. వ్యవసాయశాఖలో కొత్తగా రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సాగునీరు, విద్యుత్, ఎరువులు, విత్తనాల పర్యవేక్షణకు ఒకటి.... మార్కెటింగ్ కోసం మరొక విభాగం ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారులు నేతృత్వం వహించాలని నిర్దేశించారు.
జిల్లాలన్నీ జలసిరులతో తడుస్తాయి
దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో వరి సాగు అవుతోందని... మిగతా పంటల్లోనూ పురోగతి సాధించాలన్నారు. భవిష్యత్తులో సాగు రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల వల్ల 24 జిల్లాలు సుభిక్షంగా మారాయని... సాగునీటికి ఢోకా ఉండదని ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు గోదావరి ప్రాజెక్టుల కింద సాగునీటిని పొందుతున్నాయని తెలిపారు. కృష్ణా నదిపై నిర్మించే ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు సుభిక్షంగా మారబోతున్నాయన్నారు.