ఆప్కోలో జరిగిన అవినీతి అక్రమాలు తవ్వే కొద్దీ బయట పడుతున్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఆప్కో ఛైర్మన్ హోదాలో గుజ్జల శ్రీనివాస్ కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారనే అభియోగాలపై విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు... ఇప్పటికే కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడిన నగదు, బంగారం, వెండి, ఆస్తుల పత్రాలను కోర్టుకు సమర్పించారు.
7 నెలల నుంచి కడప జిల్లాలో విచారణ చేస్తున్న అధికారులు... పలువురి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. బోగస్ చేనేత సంఘాలు సృష్టించి... కోట్ల రూపాయలు కాజేశారనేది ఆప్కో మాజీ ఛైర్మన్ గుజ్జల శ్రీనివాస్‌పై అభియోగం. 2016 నుంచి 2019 వరకు ఆప్కో ఛైర్మన్‌గా పనిచేసిన కడప జిల్లా ఖాజీపేటకు చెందిన గుజ్జల శ్రీనివాస్... అనతి కాలంలోనే ఆప్కో అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
70 శాతం వస్త్రం కడప నుంచే...
ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఏకరూప దుస్తులను ఉచితంగా ఇస్తోంది. చేనేత కార్మికులు నేసిన వస్త్రాన్ని ఆప్కో కొనుగోలు చేసి... మెప్మా ఆధ్వర్యంలో కుట్టించి విద్యార్థులకు ఇస్తున్నారు. కానీ ఆప్కో మాజీ ఛైర్మన్ గుజ్జల శ్రీనివాస్... చేనేత కార్మికుల నుంచి వస్త్రాన్ని కొనుగోలు చేయకుండా చెన్నై, తెలంగాణ, బెంగళూరు ప్రాంతాల నుంచి పవర్ లూమ్స్ ద్వారా తయారైన "లివరీ" వస్త్రాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆప్కో సంస్థకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కానీ ఈ లివరీ వస్త్రాన్ని చేనేత కార్మికుల నుంచే కొనుగోలు చేసినట్లు బిల్లులు చూపించారు. ఖాజీపేటలోని దయాఖాన్ పల్లె సొసైటీలోనే ఎక్కువగా వస్త్రాలను కొన్నట్లు చూపించారు. రాష్ట్రానికంతటికీ అవసరమైన వస్త్రాన్ని కడప జిల్లా నుంచే 70 శాతం కొన్నట్లు బిల్లులు చూపించారని సమాచారం. ఆగస్టులో ఖాజీపేటలోని గుజ్జల శ్రీనివాస్ ఇళ్లు, కార్యాలయాలు, గోదాముల్లో సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులు... కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 10 కిలోల బంగారు ఆభరణాలు, 16 కిలోల వెండి ఆభరణాలు, కోటి రూపాయల నగదు, విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
గుజ్జల శ్రీనివాస్ విచారణకు న్యాయ సలహా
ఆగస్టులో గుజ్జల శ్రీనివాస్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో ఓ డిజిటల్ లాకర్ కూడా ఉంది. ఆ డిజిటల్ లాకర్ శ్రీనివాస్ భార్య వేలిముద్ర ద్వారా మాత్రమే తెరుచుకుంటుంది. ఆమెకు సమన్లు జారీ చేసినా కొవిడ్ కారణంగా రెండు నెలలపాటు రాలేకపోయారనే సాకు చూపించారు. ఎట్టకేలకు ఆమె బుధవారం కడపకు వచ్చి డిజిటల్ లాకర్‌ను తెరిచారు. అందులో 2 కిలోల 30 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
39 బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటితోపాటు రూ. 3,000 పాత నోట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు కడప కోర్టుకు సమర్పించి అనంతరం ట్రెజరీలో భద్రపరిచారు. కాగా గుజ్జల శ్రీనివాస్‌ను విచారించేందుకు అవసరమైన న్యాయ సలహాలను అధికారులు తీసుకుంటున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా గుజ్జల శ్రీనివాస్ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.
ఇదీ చూడండి:ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి