200 Artisans Sacked in Telangana : జీతాలు మరింత పెంచాలంటూ సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను ఉద్యోగాలనుంచి తొలగిస్తూ.. విద్యుత్ సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్రంలోని మొత్తం 4 విద్యుత్ సంస్థల పరిధిలో 20,500మంది వరకు ఆర్టిజన్లు పనిచేస్తున్నారు. నిన్న 80శాతానికి పైగా విధుల్లో పాల్గొన్నారు. జెన్‌కోలో 100 శాతం ఆర్జిజన్లు విధులకు వచ్చారని ట్రాన్స్‌కో, డిస్కంలలో 80 శాతం మంది హాజరైనట్లు సీఎండీ ప్రభాకరరావు పేర్కొన్నారు.
Telangana Artisans Sacked : విద్యుత్ సంస్థల్లో సమ్మెలను 6 నెలలపాటు నిషేధిస్తూ అత్యవసర సర్వీసుల చట్టం కింద గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభాకరరావు తెలిపారు. సర్వీస్ నిబంధన ప్రకారం సమ్మె చేయడం దుష్ప్రవర్తన కిందకు వస్తుందని ముందుగానే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. సమ్మె నేపథ్యంలో ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరాలో.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ప్రభాకరరావు వివరించారు.
Electrical employees strike: మరోవైపు ఆర్టిజన్ల సమ్మె యదావిధిగా కొనసాగుతుందని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ పేర్కొంది. ట్రాన్స్‌కోలో 80 శాతం మంది, జెన్‌కో, డిస్కంలలో కలిసి 60 శాతం ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొన్నారని తెలిపింది. యూనియన్లకు అతీతంగా సమ్మెలో పాల్గొనడానికి ఆర్టిజన్లు ముందుకు వస్తున్నారని, రేపటి నుంచి మరింత మంది సమ్మెకి దిగుతారని వెల్లడించింది. అరెస్టులకు, ఉద్యోగాల తొలగింపులకు భయపడకుండా తమ సమస్యల పరిష్కారం జరిగే వరకు సమ్మెను కొనసాగిస్తామని చెప్పింది. ఇత్తెహాద్ యూనియన్ సైతం తమతో కలిసి సమ్మెలో పాల్గొంటుందని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ స్పష్టం చేసింది.