సాధారణంగా ఒక్కో ఏడాది ఒక్కొక్కరికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఎప్పుడైనా ఆ సంవత్సరాన్ని తలుచుకోవటానికి కూడా ఇష్టపడరు. కానీ... 2020.. అందుకు భిన్నం. వాళ్లని వీళ్లని అని కాదు..! మొత్తం ప్రపంచాన్నే కలవరపరుస్తోంది. జనవరిలో మొదలైన కరోనా సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. లక్షల మంది ప్రాణాలు కోల్పాయారు. ఈ కరోనాతోనే సతమతం అవుతుంటే ప్రకృతి కూడా ఇప్పుడే ప్రకోపించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో సుమారు 207 ప్రకృతి విపత్తులు సంభవించటం బహుశా చరిత్రలోనే ఇదే తొలిసారి. 2000-19 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ముంచుకొచ్చిన విపత్తులు 185 అయితే... 2020.. 6 నెలల్లో 200కు పైగా ఇలాంటి ప్రమాదాలు జరగటం విస్మయపరుస్తోంది. ఒక్క అమెరికాలో తప్ప దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సగటు కన్నా ఎక్కువ ప్రకృతి విపత్తులు నమోదయ్యాయి.
2019లో సంభవించిన ప్రకృతి విపత్తులతో పోల్చి చూస్తే...ఈ ఏడాది ముగియక ముందే 27% ఎక్కువగా ఇవి నమోదయ్యాయి. గతేడాది మొదటి ఆర్నెల్లలో 163 ప్రకృతి విపత్తులు అందరినీ అతలాకుతలం చేస్తే...ఈ ఏడాది ఆ సంఖ్య దాటింది. 1980 నుంచి 2019 వరకు చూసుకుంటే విపత్తుల కారణంగా వాటిల్లిన నష్టం 78 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ...ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 75 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లగా అందులో 71 బిలియన్ డాలర్ల మేర ప్రకృతి విపత్తుల కారణంగానే కోతపడింది. ఏ స్థాయిలో దేశాలపై ప్రతికూల ప్రభావం పడిందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. మొత్తం ఆర్థిక నష్టంలో ఉత్తర అమెరికాలో సంభవించిన విపత్తుల వాటాయే 47%గా ఉంది. ఐరోపా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ఆర్థిక నష్టాలు కాస్తంత తక్కువగా ఉన్నాయి.
ఈ విపత్తులతో ప్రపంచవ్యాప్తంగా 2 వేల 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో 60% మేర మరణాలు వరదల కారణంగానే సంభవించాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. ఇక్కడే వెయ్యి మంది మృతి చెందారు. కానీ...1972 నాటి నుంచి చూస్తే ప్రకృతి విపత్తుల కారణంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటితో పోల్చుకుంటే తక్కువేనని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం నమోదైన మొత్తం మరణాల్లో ఆసియా-పసిఫిక్, ఆఫ్రికాల్లోనే 70% ఉన్నాయి. గతేడాది ఆఫ్రికాలో మొదటి ఆర్నెల్లలో తుపానుల కారణంగా సుమారు 2 వేల 900 మంది ప్రాణాలు కోల్పాయారు. ఉష్ణమండలాల్లో ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే...తుపానుల తీవ్రత 1-10% వరకు అధికమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ మార్పుల అంతర్జాతీయ కమిటీ-ఐపీసీసీ పేర్కొంది. రాబోయే రోజుల్లో భూతాపాన్ని తగ్గించుకోకపోతే మరిన్ని విధ్వంసాలు చూడక తప్పదని హెచ్చరిస్తోంది.
ఆగ్నేయ అమెరికాలో తీవ్ర స్థాయిలో తుపానులు విరుచుకుపడ్డాయి. ఈస్టర్ వారాంతం సమయంలో ఈ ప్రాంతంలో టెన్నిస్ బంతుల పరిమాణంలో వడగళ్లు పడటం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఆగ్నేయ అమెరికాలోని 10 రాష్ట్రాల్లో దాదాపు 140 తుపానులు అల్లకల్లోలం చేశాయి. గంటకు 3 వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి బీభత్సం సృష్టించాయి. ఎన్నో ఇళ్లు, కార్లు, బస్సులు ధ్వంసమయ్యాయి. మిస్సిసిప్పీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తుపాను సంభవించింది. మూడున్నర కిలోమీటర్ల మేర వ్యాసార్థం ఉన్న సుడిగుండం దాదాపు 100 కిలోమీటర్ల వరకు అన్నింటినీ తుడిచి పెట్టేసింది. జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభావం చూపకపోవటం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరగలేదు. ఈ తుపాను కారణంగా దాదాపు 3.4 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లగా..38 మంది ప్రాణాలు కోల్పోయారు. కెనడాలోని కల్గరీ నగరంలో జూన్ 14న వడగళ్ల వాన కురిసింది. ఇళ్లు, కార్లు ధ్వంసమయ్యాయి.