తెలంగాణ

telangana

ETV Bharat / state

వజ్రాల వ్యాపారి పుట్టినరోజు సందడి.. వారం తరువాత కరోనాతో మృతి...

హైదరాబాద్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. దాంట్లో 150 మంది పాల్గొన్నారు. పుట్టినరోజు జరుపుకున్న ఆ వ్యాపారి కరోనా లక్షణాలతో చనిపోయాడు. మరో వ్యాపారి కూడా మరణించాడు. ఓ ప్రజాప్రతినిధికి కూడా పాజిటివ్ వచ్చింది. అయితే ఈ పుట్టిన రోజు వేడుకల విషయాన్ని గోప్యంగా ఉంచారు. అధికారులు ఆ వేడుకల్లో పాల్గొన్నవారి వివరాలు సేకరిస్తే.. కొందరినైనా వైరస్‌ బారినుంచి కాపాడే అవకాశాలున్నాయి.

corona
corona

By

Published : Jul 4, 2020, 6:30 AM IST

తన జన్మదిన వేడుకకు బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించిన ఓ వజ్రాభరణాల వ్యాపారి కుటుంబంలో విషాదం అలుముకుంది. పుట్టిన రోజు పండుగ జరుపుకొన్న ఆ వ్యాపారి కొద్దిరోజులకు కొవిడ్‌-19 లక్షణాలతో చనిపోగా.. మరో వ్యాపారి కూడా మృతి చెందాడు. వేడుకకు హాజరైన వారిలో 20 మందికి కరోనా సోకింది. ఓ ప్రజాప్రతినిధికి సైతం పాజిటివ్‌ అని తేలింది. వ్యాపారి కరోనాతో చనిపోయినట్టు ఆయన కుటుంబసభ్యులు ప్రభుత్వ అధికారులకు తెలిపినా.. పుట్టినరోజు వేడుక విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాజాగా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్‌ వచ్చినా పోలీసులు, జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖ అధికారులు వివరాలను తెలుసుకోలేదు.

మన దరికి రాదులే..

హిమాయత్‌నగర్‌లో నివాసముంటున్న ఈ బంగారు, వజ్రాభరణాల వ్యాపారి గతనెల మూడోవారంలో తన పుట్టినరోజు వేడుకను ఇంట్లోనే జరుపుకొన్నారు. ఓ ప్రజాప్రతినిధి, నగరంలోని జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మొత్తం 150 మంది పాల్గొన్నారు. సామూహికంగా విందు భోజనం చేశారు. 'అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం... విందుకు వినియోగించిన పాత్రలు, ఆహార పదార్థాలతో సహా అన్నీ శుభ్రం చేశాం. సమావేశపు గది ముందుగానే శానిటైజ్‌ చేశాం.. కరోనా మనందరికి రాదులే' అంటూ ఆతిథ్యమిచ్చిన వ్యాపారి వారందరితో అన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ గుర్తుగా బహుమతులను ఇచ్చారు.

తేరుకునేలోపు మృత్యువాత..

జన్మదిన కార్యక్రమం పూర్తైన మూడురోజులకు వజ్రాభరణాల వ్యాపారికి దగ్గు, ఆయాసం వచ్చింది. వైద్యులకు చూపించుకునేందుకు మాసాబ్‌ట్యాంక్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు పరిశీలించి మందులివ్వడంతో పాటు ఎందుకైనా మంచిది.. కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోండి అని సూచించారు. ఇది సాధారణ దగ్గు, ఆయాసమే కదా అనుకుని ఆయన పట్టించుకోలేదు. ఇక విందుకు హాజరైన జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ కీలక ప్రతినిధికి నాలుగు రోజులయ్యాక తీవ్ర జ్వరం వచ్చింది. మాత్రలు వేసుకుందాం తగ్గుతుందిలే అనుకుని వదిలేశారు.. వారం క్రితం జ్వరం తిరగబెట్టడంతో ఆయన కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్ ‌12లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు.

కొవిడ్‌-19 నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌ వచ్చింది. చికిత్స పొందుతూ మూడురోజుల క్రితం చనిపోయాడు. మరోవైపు పుట్టినరోజు జరుపుకొన్న వ్యాపారికి దగ్గు, ఆయాసంతో పాటు జ్వరం రావడంతో ఐదురోజుల క్రితం సికింద్రాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మూడురోజుల క్రితం మృతి చెందాడు. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌, వైద్యాధికారులు ఆ వేడుకల్లో పాల్గొన్నవారి వివరాలు సేకరిస్తే.. కొందరినైనా వైరస్‌ బారినుంచి కాపాడే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details