'ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడుతుందనే వార్తల్లో నిజం లేదు' - bandi sanjay news
16:03 April 25
'ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడుతుందనే వార్తల్లో నిజం లేదు'
Praja Sangrama Yatra: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత 'ప్రజా సంగ్రామ యాత్ర’ రెండ్రోజుల పాటు వాయిదా పడుతుందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి ప్రకటన విడుదల చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర యధావిధిగా కొనసాగుతుందన్నారు. ఈ రోజు మక్తల్లో జరిగే బహిరంగ సభ అనంతరం రాత్రి బస చేసే శిబిరం నుంచే రేపు యధావిధిగా పాదయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. గత 12 రోజులుగా మండుటెండలో పాదయాత్ర చేయడంవల్ల బండి సంజయ్ వడదెబ్బకు గురయ్యారని.. దీనికితోడు ఎసిడిటీ సమస్య తోడవడంతో అస్వస్థతకు లోనయ్యారని పేర్కొన్నారు. బండి సంజయ్కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆయన ఆరోగ్య రీత్యా పాదయాత్రకు విరామం ఇవ్వాలని సూచించారు. బండి సంజయ్ మాత్రం పాదయాత్ర కొనసాగించడానికే మొగ్గు చూపారని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను యథాతథంగా కొనసాగనుంది. సమాచార లోపం వల్ల మాత్రమే పాదయాత్రకు రెండ్రోజులు విరామం ఇస్తున్నట్లు పొరపాటుగా వెలువరించడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఈ యాత్ర శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి సన్నిధి అలంపూర్ నుంచి ప్రారంభమైంది. 31 రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో 29 రోజులు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే బండి సంజయ్ పర్యటిస్తారు. నాగర్కర్నూల్, మహబూబ్నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలతో సహా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర జరగనుంది. ప్రస్తుతం నారాయణపేట జిల్లాలో బండి సంజయ్ యాత్ర కొనసాగుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది.
ఇవీ చదవండి: