KTR Tweet: సమతా మూర్తి విగ్రహాన్ని.. వివక్షకు ప్రతిరూపం ఆవిష్కరించిందని ప్రధాని నరేంద్రమోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ నిన్న కేటీఆర్ చేసిన ట్వీట్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా నేత ఎన్.రామచంద్రరావు స్పందించారు. రామానుజాచార్యల సమానత్వ స్ఫూర్తి వేడుకల వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయడం దురదృష్టకరని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి రాజకీయ దాడులను ఎన్నో ఎదుర్కొన్నారన్న కిషన్ రెడ్డి... అయితే రామానుజార్యులను వదలిపెట్టాలన్నారు. పదిహేను నిమిషాల సమయం ఇస్తే వందల కోట్ల హిందువులను చంపుతామన్న ఎంఐఎంతో కలిసి పనిచేస్తూ.. అందరి వెంట ఉండే అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తారా అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
కేటీఆర్ కౌంటర్...
దానిపై స్పందించిన కేటీఆర్ రాష్ట్రంపై కేంద్రం ఉదాసీనతను ప్రశ్నిస్తే సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తున్నారని కిషన్ రెడ్డిని విమర్శించారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, పథకాలను ప్రస్తావించిన కేటీఆర్.. వాటిపై కేంద్రం ఉదాసీనతపై వివరణ ఇవ్వాలన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మరో ట్వీట్ చేసిన కిషన్ రెడ్డి.. పాతబస్తీలోని వందల ఆలయానికి ధ్వంసం చేసిన చరిత్ర ఉన్న ఎంఐఎం మద్దతుతో కుటుంబపాలన సాగిస్తున్నారని విరుచుకుపడ్డారు.