నవంబరు 20 నుంచి డిసెంబర్ ఒకటి వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. ఏపీ కర్నూలు జిల్లాలో 21 పుష్కర ఘాట్లు, రహదారులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 207 కోట్ల నిధులు మంజూరు చేసింది. టెండర్లు పిలిచి పనులూ అప్పగించింది. కొన్ని ఘాట్లలో పనులు జోరుగా సాగుతున్నా... నదిలో వరద ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిచోట్ల ఆలస్యం అవుతున్నాయి.
కర్నూలు, నందికొట్కూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్లకు వెళ్లొచ్చేందుకు వీలుగా రహదారులు వేస్తున్నారు. పనులను పరిశీలించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తేవాలని అధికారులను ఆదేశించారు.