Tummala Join Congress :నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ పయనం ఇకపై కాంగ్రెస్‌లో సాగనుంది. హైదరాబాద్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో శనివారం తుమ్మల హస్తం గూటికి చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పిన ఖర్గే.. పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్తో 9 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి తెగదెంపులు చేసుకున్న సీనియర్ నేత జిల్లాలో కాంగ్రెస్ కీలకనేతగా మారనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీనియర్ నేతతుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)చేరిక ఉభయ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతోంది.
CWC Meeting Started at Hyderabad : హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశాలు
Joint Khammam District Politics Latest News 2023 : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్( ప్రస్తుత బీఆర్ఎస్) ప్రజలు బ్రహ్మరథం పట్టినప్పటికి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని (Joint Khammam District ) ఒక్కస్థానమే దక్కింది. 2014 ఎన్నికల్లో ఒక్క కొత్తగూడెం స్థానాన్ని గులాబీ పార్టీ దక్కించుకుంది. అదే ఎన్నికల్లో ఖమ్మం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. అప్పటికే జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అనుభవంతోపాటు రాజకీయంగా ఆత్మీయుడైన తుమ్మలను కేసీఆర్ గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు.
Tummala Nageswara Rao Joins Congress :కేసీఆర్ ఆహ్వానం మేరకు 2014 సెప్టెంబరులో తుమ్మల నాగేశ్వరరావుగులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో అప్పటి వరకు కనీస ఉనికిలేని అప్పటి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్).. ఆయన చేరికతో బలీయశక్తిగా ఎదిగింది. భారీగా నేతలు, కార్యకర్తలు తుమ్మల వెంట గులాబీ దండులో చేరడం పార్టీకి జవసత్వాలు నింపింది. అదే ఏడాది చివర్లో తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రిగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. 2015లో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత 2016లో పాలేరుకు ఉపఎన్నిక రాగా.. అక్కడి నుంచి తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు.
ఇలా ప్రభుత్వంలో పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. రాజకీయ పునరేకీకరణలో భాగంగా జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలంతా గులాబీ బాటపట్టడంతో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల ఓటమి పాలయ్యారు. పాలేరులో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గులాబీ గూటికి చేరడంతో.. రాజకీయంగా ఆయన మౌనంగా ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు సీఎం పిలుపుమేరకు తుమ్మల నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించారు.