తెలంగాణ

telangana

ETV Bharat / state

TIRUMALA TICKETS: శ్రీవారి దర్శన కోటా టికెట్లు 5వేల నుంచి 8వేలకు పెంపు - తితిదే వార్తలు

ఆగస్టు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా 8 వేలకు పెంచామని తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. కరోనా ఉద్ధృతి వల్ల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడం లేదన్న ఈవో.. పరిస్థితి పరిశీలించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సెప్టెంబరు ఆఖరు నాటికి అలిపిరి కాలిబాట మార్గం పనులు పూర్తవుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ttd-tickets-increased-in-agust-month
ttd-tickets-increased-in-agust-month

By

Published : Aug 7, 2021, 7:46 PM IST

శ్రీవారి దర్శన కోటా టికెట్లు 5వేల నుంచి 8వేలకు పెంపు

కరోనా మూడో దశకు సంబంధించి ఏపీ ప్రభుత్వ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని దర్శన టికెట్లను పరిమితం చేశామని టీటీడీ ఈవో కె.ఎస్‌. జవహర్‌రెడ్డి చెప్పారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు నెలలో దర్శన కోటా టికెట్లను 5వేల నుంచి 8వేలకు పెంచామని వివరించారు. తిరుమలలో ఇటీవల చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను భక్తులకు వివరించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను డీనోటిఫై చేసేవరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని, అప్పటి వరకు తిరుమల శ్రీవారి దర్శనానికి పరిమితంగానే టికెట్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు. శనివారం తితిదే పరిపాలన భవనంలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి భక్తులు ఫోన్ ద్వారా చేసిన ఫిర్యాదులు, సలహాలను ఈవో స్వీకరించి సమాధానాలు ఇచ్చారు.

తిరుమల గిరుల్లో ఉన్న జాపాలి ఆంజనేయస్వామి ఆలయాన్ని తితిదేకి అప్పగించాల్సిందిగా దేవాదాయ శాఖకు లేఖ రాశామని.. ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా జాపాలి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాల్లో లోతైన అవగాహన కలిగిన పరిశోధకులు, పండితులు సమగ్ర పరిశోధన చేసి అనేక ఆధారాలతో తిరుమలలోని అంజనాద్రే హనుమంతులవారి జన్మస్థలమని నిరూపించారని పేర్కొన్నారు. గత నెలలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ వెబినార్‌ నిర్వహించామని.. దేశంలోని పలు ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు, నిష్ణాతులు పాల్గొన్నారని వివరించారు. వెబినార్‌లో చర్చకు వచ్చిన అంశాలతో పాటు తితిదే ఏర్పాటు చేసిన పండిత పరిషత్‌ వెల్లడించిన వివరాలతో సమగ్ర గ్రంథం ముద్రిస్తామని తెలిపారు. ఆకాశ‌గంగ‌లో ఆంజ‌నేయ‌స్వామివారి విగ్రహం నిర్మాణంతో పాటు హనుమంతుని జన్మవృత్తాంతం తెలిపేలా థీమ్‌పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాటిని శ్రీవారి నైవేద్యంతో పాటు భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు విస్తృత చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జూలై నెలలో హుండీ ఆదాయం రూ.55.58కోట్లు వచ్చిందని, శ్రీవారిని 5.32 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తితిదే అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, జేఈవో సదాభార్గవి, సీవీఎస్‌వో గోపినాథ్‌రెడ్డి, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

హుజూరాబాద్​లో దళితులకేమో కోట్లు.. ఇక్కడేమో చచ్చిపోతే కనీసం పరామర్శించరా?

ABOUT THE AUTHOR

...view details