తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల వినియోగంపై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. తిరుమల శ్రీవారి హుండీతో పాటు వివిధ రూపాల్లో తితిదేకు సగటున నెలకు వంద కోట్ల రూపాయల పైబడి ఆదాయం సమకూరేది. కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తుండగా శ్రీవారి ఆదాయం గణనీయంగా పడిపోయింది. కరోనాకు ముందు రోజు దాదాపు రెండు కోట్ల రూపాయల మేర హుండీ ఆదాయం సమకూరింది. కరోనా లాక్‌డౌన్ ప్రభావంతో మూడు నెలల పాటు పూర్తిగా దర్శనాలు నిలిపివేశారు. అన్‌లాక్ ప్రారంభం నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతిస్తుండటంతో హుండీ ఆదాయం 50 లక్షల రూపాయలకు తగ్గిపోయింది.
భక్తుల హుండీ సమర్పణ, వసతిగృహాల అద్దెలు, దర్శన టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, తలనీలాల వేలం వంటి వాటితో పాటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన స్వామివారి బంగారం, నగదుకు వడ్డీ రూపంలో ఆదాయం సమకూరేది. కరోనాతో నేరుగా వచ్చే ఆదాయాల్లో భారీగా కోతపడింది. మరోవైపు బ్యాంకుల్లో డిపాజిట్లకు వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. ఏడాదికి రెండున్నర వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తితిదేపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఈ నేపథ్యంలో ఆలయాల నిర్వహణతో పాటు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు నిధుల కొరత ఏర్పడుతుందని భావిస్తున్న తితిదే.. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది డిసెంబర్ నెలకు గడువు తీరనున్న దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్ల మొత్తాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీ బాండ్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొంది. బ్యాంకుల్లో వడ్డీ తగ్గిపోవడం వల్ల ఆదాయం సమకూర్చుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తితిదే ఛైర్మన్ తెలిపారు.