తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీవారి ఆస్తుల విక్రయానికే తితిదే మొగ్గు! - Tirumala Tirupati Devasthanam news

నిరర్ధక ఆస్తుల పేరుతో తిరుమల శ్రీవారి ఆస్తుల విక్రయానికే తితిదే మొగ్గు చూపుతోంది. దాతలు ఇచ్చిన భూములను కాపాడాలన్న డిమాండ్ వస్తున్నా... తితిదే గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో 23 ఆస్తులే గాక.. భవిష్యత్తుల్లో మరిన్ని ఆస్తులను అమ్మేందుకు జాబితాను సిద్ధం చేస్తోంది.

ttd-decides-to-auction-twentythree-srivari-assets-in-tamilnadu
శ్రీవారి ఆస్తుల విక్రయానికే తితిదే మొగ్గు!

By

Published : May 25, 2020, 7:39 AM IST

ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా.. నిరర్థక ఆస్తుల పేరుతో తిరుమల శ్రీవారి ఆస్తుల విక్రయానికే తితిదే మొగ్గు చూపుతోంది. దాతలు ఇచ్చిన భూములు కాపాడాలని, వాటిని విక్రయించవద్దని డిమాండ్‌ వస్తున్నా.. తితిదే గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. పైగా తమిళనాడులో వేలానికి సిద్ధం చేసిన 23 ఆస్తులతో పాటు.. భవిష్యత్తులో మరిన్ని ఆస్తులను అమ్మేందుకు జాబితాను సిద్ధం చేస్తోంది. తితిదే శనివారం విడుదల చేసిన ప్రకటన మేరకు ఇప్పటి వరకు విక్రయించడానికి గుర్తించిన ఆస్తుల విలువ రూ.23.92 కోట్లుగా లెక్కగట్టారు. వాస్తవానికి తితిదే బడ్జెట్‌లో నిరర్థక ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పొందుపర్చింది. ఈ అంచనాలను బట్టి ఇప్పటికే గుర్తించిన భూములే కాకుండా దేశవ్యాప్తంగా దాతలు తిరుమల వెంకన్న స్వామికి ఇచ్చిన ఆస్తులను భవిష్యత్తులో విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.

నగర ప్రాంతాల్లోనూ..
గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూములే కాకుండా నగర పరిధిలోని విలువైన స్థలాలు వేలం వేసేందుకు తితిదే సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని కొత్తరాముల వీధి గుడిలో ఉన్న 2487 చదరపు అడుగుల భవనాన్ని విక్రయించేందుకు ధర్మకర్తల మండలి ఫిబ్రవరిలోనే తీర్మానించింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం అంబర్‌పేట కలాన్‌ ప్రాంతంలోని 1800 చ.అ. ఇంటి స్థలాన్ని అమ్మకానికి పెట్టనుంది. ఇదే జిల్లా మల్కాజిగిరి మండలం యాదవ్‌నగర్‌ పరిధిలోని 800 చ.అ. అపార్ట్‌మెంటు ఫ్లాట్‌ను విక్రయించనుంది. నాందేడ్‌, బెంగళూరు నగరాల్లోనూ కొన్ని ఆస్తులు అమ్మకానికి సిద్ధం చేసిన జాబితాలో ఉన్నాయి.

భగ్గుమన్న విపక్షాలు...
దాతలు తిరుమల శ్రీవారిపై భక్తితో ఇచ్చిన ఆస్తులను విక్రయించేందుకు దేవస్థానం సిద్ధపడటంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. భాజపా యువమోర్చా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌నాయుడు తిరుపతిలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తితిదే నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. దీన్ని ఉపేక్షించబోమని, గవర్నర్‌, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు న్యాయపరంగానూ పోరాడతామని చెప్పారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నట్లు వెల్లడించారు. తితిదే నిర్ణయాన్ని తుడా మాజీ ఛైర్మన్‌ నరసింహయాదవ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ, ప్రజా, ధార్మిక సంఘాల ప్రతినిధులు ఆదివారం తిరుపతిలో ఈ వ్యవహారంపై స్పందించాయి. ఆందోళనలకు పిలుపునిచ్చాయి.

ఇదీ చదవండి:విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details