తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆన్​లైన్​ ద్వారా భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలు' - శ్రీవారి ఆర్జిత సేవలు

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా... పాలక మండలి సమావేశంలో తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులు మహమ్మారి బారిన పడకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రకటించిన తితిదే.... భక్తులకు సేవలందిస్తున్న సిబ్బంది ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే రోజుకు 12,000 మందికి దర్శనాలను కల్పిస్తున్నామని పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఆగమ పండితుల సలహా మేరకు ఆన్ లైన్ ద్వారా భక్తులు శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే అంశంపైనా సమాలోచనలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఆన్​లైన్​ ద్వారా భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలు
ఆన్​లైన్​ ద్వారా భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలు

By

Published : Jul 5, 2020, 4:54 AM IST

రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్​లో నిర్వహించిన సమావేశంలో... ధర్మకర్తల మండలి సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. తితిదే అవళంబిస్తున్న విధానాలపై ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... పాలకమండలి సభ్యులతో చర్చించారు. స్వామివారి దర్శనం, టిక్కెట్ల కేటాయింపు, అన్నప్రసాదాల వితరణ, ఉద్యోగుల ఆరోగ్య భద్రత, కర్ణాటక సత్రాల నిర్మాణం, ఆన్ లైన్ ద్వారా భక్తులకు ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించటం... తదితర అంశాలపైన ధర్మకర్తల మండలి సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు.

భక్తుల సంఖ్య పెంచబోం...

రోజుకు 12వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నామని ఛైర్మన్ వైవీ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ స్వామి వారి దర్శనానికి వచ్చిన ఒక్క భక్తునికీ కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోగలిగామన్నారు. తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భక్తుల సంఖ్యను పెంచకూడదని నిర్ణయం తీసుకున్నామన్నారు. దర్శనాలను తితిదే ఆదాయవనరుగా చూస్తోందంటూ కొందరు దుష్ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దర్శనాలను ప్రారంభించినప్పటి నుంచి 17మంది తితిదే సిబ్బంది కరోనా బారిన పడ్డారన్న సుబ్బారెడ్డి... తితిదే ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఉద్యోగులకు రెండు వారాలు షిప్టులు కేటాయించాలని నిర్ణయించామన్న ఛైర్మన్... సిబ్బంది ఆరోగ్యం విషయంలో ఎంత ఖర్చైనా వెనుకాడమన్నారు.

శ్రీవారి ఆదాయం పెంచుతాం..

కర్ణాటక సత్రం విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఒప్పందం చేసుకున్నామని వైవీ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం కేటాయించే 200 కోట్లతో 5ఎకరాల్లో పనులను ప్రారంభిస్తామన్నారు. పూర్తి స్థాయిలో పారదర్శకత పాటించేలా... వసతి గృహాలను కేటాయింపులను ఆన్​లైన్ బిడ్డింగ్ ద్వారా ఇస్తామని వెల్లడించారు. తద్వారా శ్రీవారికి వచ్చే ఆదాయాన్ని పెంచుతామన్నారు. శ్రీవారి కల్యాణోత్సవ సేవను ఆన్​లైన్ ద్వారా త్వరలోనే ప్రారంభిస్తామన్న ఆయన... ఆర్జిత సేవల్లో శ్రీవారి భక్తులు ఆన్ లైన్ ద్వారా పాల్గొనే అవకాశంపై ఆగమ పండితులతో చర్చిస్తున్నామన్నారు.

కల్యాణ కట్ట, అన్నప్రసాద కేంద్రాల వద్ద మరింత జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్న తితిదే ఛైర్మన్... కంటైన్మెంట్, రెడ్ జోన్​ల నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి రావద్దని కోరారు.

ఇదీ చూడండి:తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details