ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాలో చిత్తూరు అగ్రభాగాన ఉంది. జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 80 శాతం తిరుపతి నగరంలో ఉండటం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం.. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తిరుపతి కేంద్రంగా జారీ చేస్తున్న సర్వదర్శనం టోకెన్ల సంఖ్య తగ్గించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు 20 నుంచి 25 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేసేవారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు తిరుపతిలో జారీచేసే సర్వదర్శనం టోకెన్ల వద్ద గుమికూడటం వల్ల కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉందని భావించిన తితిదే సర్వ దర్శనం టోకెన్ల సంఖ్యను 15వేలకు పరిమితం చేశారు.
రద్దీ ప్రాంతాల్లో శానిటైజేషన్..
ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్దర్శనం, శ్రీవాణి ట్రస్ట్, సుపథం ప్రవేశం ఇలా వివిధ రకాలుగా రోజుకు 55 నుంచి 60వేల మందిని దర్శనాలకు అనుమతిస్తుండగా.. ఆ సంఖ్యను 45 వేలకు పరిమితం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి క్యూలైన్ల వరకూ శానిటైజేషన్ తీవ్రం చేశారు. అలిపిరి టోల్ గేట్ వద్ద భక్తులను కిందకు దించి బస్సులను డిస్ఇన్ఫెక్షన్ చేస్తున్నారు. దర్శన టికెట్లు ఉన్న భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే తిరుమలకు చేరుకొనేలా అలిపిరి టోల్గేట్, కాలినడక మార్గాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు.