TSRTC Zero Tickets for Women : టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కోసం జీరో టికెట్ల (TSRTC Zero Tickets) జారీని అధికారులు మొదలు పెట్టారు. గురువారం అర్ధరాత్రి 12 గంటలు దాటాక ఈ విధానం అమల్లోకి వచ్చిందని చెప్పారు. టికెట్లు జారీ చేసే యంత్రా(టిమ్స్)ల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేశామని వివరించారు. బుధవారం రాత్రి నుంచే కుషాయిగూడ, మిధాని సిటీ డిపోల్లో ప్రయోగాత్మకంగా ‘జీరో టికెటింగ్’ అమలు చేసినట్లు పేర్కొన్నారు. అది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో అమల్లోకి తెచ్చామని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం నుంచి జీరో టికెట్లు జారీ చేయాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులకు ఎండీ వీసీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) ఆదేశాలిచ్చారు. డిసెంబరు 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. జీరో టికెట్‌లో బస్సు ఆర్డినరా, ఎక్స్‌ప్రెస్సా, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం తదితర వివరాలు అందులో ఉంటాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రారంభం - సద్వినియోగం చేసుకోవాలన్న నేతలు
పండగలు, జాతరలకు నడిపే బస్సులకూ వర్తింపు :రెగ్యులర్ బస్సులతో పాటు సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలు, కొమురవెల్లి, నాగోబా వంటి జాతరల సమయాల్లో జీరో టికెట్ అమలు చేయాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. పల్లెవెలుగు, మినీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ బస్సులతో పాటు రద్దీని బట్టి అదనంగా నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు జీరో టికెట్ వర్తింపజేయనున్నట్లు పేర్కొంది. వారాంతాల్లో నడిపే అదనపు బస్సులకూ కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.