TSRTC Workers Protest at Raj Bhavan :ఆర్టీసీ ఉద్యోగుల బిల్లును గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై కొన్ని సందేహాలున్నాయని.. ఈ మేరకు సీఎస్ శాంతికుమారికి లేఖ రాశారు. మరోవైపు గవర్నర్ ఇంకా బిల్లుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆర్టీసీ కార్మికులు తప్పుబట్టారు. ప్రభుత్వం, కార్మికులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే తమిళిసై ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రాజ్‌భవన్ వద్ద నిరసనకు టీఎంయూ పిలుపునిచ్చింది.
RTC Workers Demands Governor to Approve RTC Bill : ఈ క్రమంలోనే ఆర్టీసీకార్మికులు నెక్లెస్‌రోడ్డు నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా వచ్చారు. ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించాలని నిరసన చేపట్టారు. బిల్లుపై ఎలాంటి రాజకీయాలు చేయకుండా ఆమోదించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని డిపోల నుంచి వచ్చిన కార్మికులు పాల్గొన్నారు. ధర్నా నేపథ్యంలో రాజ్‌భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికుల ఆందోళనలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. 10 మంది ప్రతినిధుల బృందాన్ని రాజ్‌భవన్‌లోకి ఆమె ఆహ్వానించారు. ప్రస్తుతం గవర్నర్ పుదుచ్చేరిలో ఉండగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూనియన్ నాయకులతో చర్చలు నిర్వహించారు. టీఎంయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.ఆర్.రెడ్డి, థామస్‌రెడ్డి బృందం.. తమిళిసై సౌందర రాజన్‌తో గంటకు పైగా చర్చించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తనను ఎంతో బాధించిందని అన్నారు. ఈ సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ కార్మికుల పక్షమేనని అన్నారు. గతంలో సమ్మె చేసినప్పుడు కార్మికులకు అండగా ఉన్నానని గుర్తు చేశారు. కార్మికుల ప్రయోజనాల కోసమే బిల్లును క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. ఈ మేరకు గవర్నర్ ట్వీట్ చేశారు.
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తమ సమస్యలు విని.. సానుకూలంగా స్పందించారని సమావేశం అనంతరం టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను కోరామని చెప్పారు. కార్మికుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని.. తమిళిసై చెప్పారని వివరించారు. త్వరలోనే బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు.