దేశవ్యాప్తంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువగా నైపుణ్యం లేని డ్రైవర్ల వల్లే జరుగుతున్నాయని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిని అధిగమించేందుకు నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ్యమైన, నాణ్యమైన డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా భారీ మోటార్ వాహనాలు, లైట్ మోటార్ వాహనాలకు జోనల్ స్టాఫ్ శిక్షణ కేంద్రం... వరంగల్, హకీంపేట్ కేంద్రాల్లో నిరుద్యోగ యువతీ, యువకులకు డ్రైవింగ్‌లో శిక్షణ అందిస్తున్నారు. వీటితో పాటు మరో 30 శిక్షణ కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ కృషి చేస్తోంది. ఈ 30 కేంద్రాల్లో ఇప్పటికే మూడు కేంద్రాల్లో ఆర్టీఏ నుంచి అనుమతులు రావడం వల్ల కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్-2 డిపో, పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, జగిత్యాల కేంద్రాల్లో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించింది. మరో 27 కేంద్రాల్లో శిక్షణ సంస్థలను ప్రారంభించేందుకు ఆయా రవాణాశాఖ కార్యాలయాల్లో దరఖాస్తులను సమర్పించింది. వాటి నుంచి అనుమతులు రాగానే మిగిలిన వాటిని ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.
సంప్రదించిన ప్రభుత్వ సంస్థలు
వరంగల్, హకీంపేట్ శిక్షణా కేంద్రాల్లో డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకునేందుకు అనేక ప్రభుత్వ సంస్థలు సంప్రదించాయి. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని 72 మందికి శిక్షణ అందించారు. వీరిలో లైట్ మోటార్ వాహనాలకు 50 మందికి, హెవీ మోటార్ వాహనాలకు 22 మందికి శిక్షణనిచ్చారు. సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సంస్థ పంపించిన 40 యువకులకు ఎల్ఎంవీలో తర్ఫీదు ఇచ్చారు. వరంగల్‌లోని శిక్షణ కళాశాలలో ఐటీడీఏ సిబ్బందిలోని 43 మందికి శిక్షణనిచ్చారు. ప్రస్తుతం ట్రైకార్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ద్వారా కూడా నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణ అందించనున్నట్లు హకీంపేట్ జెడ్ఎస్టీసీ శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ సుచరిత తెలిపారు. భారీ మోటారు వాహనాల నెల రోజుల శిక్షణకు 15వేల600 ఫీజును నిర్ణయించారు. శిక్షణానంతరం టీఎస్ఆర్టీసీ ధ్రువపత్రాన్ని అందజేస్తారు. లైట్ మోటార్ వాహనాలకు 20 రోజుల శిక్షణ మాత్రమే ఉంటుంది. దీంట్లో శిక్షణ పొందేవారికి 7వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.