ఆగిన చక్రాలు... ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు... రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణ ప్రాంగణం బస్సులు లేక వెలవెల పోతున్నాయి. రేపే బతుకమ్మ పండుగ కావడం వల్ల ప్రజలు సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లోని పలు బస్‌స్టేషన్‌లో బస్సులు కదలలేదు.
జేబీఎస్
జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఊర్లోకి వెళ్లేందుకు రిజర్వేషన్స్ చేసుకున్నప్పటికీ బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూకట్పల్లి
కూకట్‌పల్లిలో 139 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మిక విభాగం నాయకులు, కార్యకర్తలు సమ్మెకు మద్దతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే... దొరికిందే ఛాన్సు అన్నట్లు అందినకాడికి దోచుకుంటున్నారు.
కోఠి
కోఠి బస్‌స్టేషన్ వద్ద ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే... డబుల్ ఛార్జీల మోత మోగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 163 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఇక్కడ కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మేడ్చల్
మేడ్చల్‌లో బస్‌లు లేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. 126 బస్‌లు డిపోలకే పరిమితమయ్యాయి.
దిల్సుఖ్నగర్
దిల్‌సుఖ్‌నగర్‌లో బస్ డిపో వద్ద సమ్మెలో పాల్గొన్న కార్మికులను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పలకరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ తీసుకుంటానని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసి తమకు న్యాయం చేయాలని కార్మికులు ఎమ్మెల్యేకు విన్నపించారు.
హెచ్‌సీయూ
గచ్చిబౌలి హెచ్‌సీయూ వద్ద డిపోలో 136 బస్సులు నిలిచిపోయాయి. కార్మికులు విధులకు హాజరుకాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు పోలీసు సిబ్బంది 20 మంది ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నారు.
ముషీరాబాద్
ముషీరాబాద్ డిపో1, డిపో2లకు చెందిన దాదాపు 200 బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. డిపోల నుంచి అనునిత్యం పటాన్ చెరువు, సికింద్రాబాద్, కోఠి, హైటెక్ సిటీ, కోండాపుర్, మాదాపుర్, మెహిదీపట్నం, బీర్బన్ బాగ్, ఉప్పల్ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఈ బస్సు సర్వీసులు డిపోలకు పరిమితమయ్యాయి. బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
ఉప్పల్ డిపో
ఉప్పల్ డిపోలో 149, చెంగిచర్ల డిపోలో 130 బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఫలకనుమ
ఫలకనుమ డిపో వద్ద ఆర్టీసీ అధికారులు ప్రైవేటు డ్రైవర్లను, కండక్టర్లను ఏర్పాటు చేశారు. వారితో బస్‌లను రోడ్లపైకి నడిపిస్తున్నారు. ఇప్పటికే 5 బస్సులను డిపో నుంచి బయటకు పంపించారు.
పాతబస్తీ
సమ్మె కారణంగా పాతబస్తీ వద్ద 69 బస్సులు నిలిచిపోయాయి. దీనికి ప్రత్యామ్నాయంగా అధికారులు ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను పెట్టి బస్సులను నడిపిస్తామని చెబుతున్నారు.
అంబర్ పేట
అంబర్‌పేటలో ఆర్టీసీ కార్మికుల బంద్ కారణంగా పోలీసులు144 సెక్షన్ విధించారు. కాచిగూడ డిపో పరిధిలో మొత్తం 116 బస్సులకుగానూ ఇప్పటివరకు 9 బస్సులను, ఒక ప్రైవేటు బస్సును నడుపుతున్నారు. అలాగే బర్కత్‌పురా డిపో పరిధిలో మొత్తం 89 బస్సులకు గానూ కేవలం 6 బస్సులను తిప్పుతున్నారు.
కుషాయిగూడ
ఆర్టీసీ సమ్మె కారణంగా కుషాయిగూడ డిపోలో అధికారులు ఇప్పటివరకు 21 బస్సులు తాత్కాలిక డ్రైవర్లతో నడుపుతున్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.
ఇదీ చూడండి: సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది: ఆర్టీసీ ఐకాస