తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు - TSRTC STRIKE ENDED

ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని సున్నితంగా ముగించింది సర్కారు. ఆర్టీసీ సంస్థకు తక్షణమే రూ.100 కోట్ల ఆర్థికసాయంతో పాటు కిలోమీటర్​కు 20 పైసల చొప్పున సోమవారం నుంచి బస్సు ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. సమ్మె సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. సింగరేణి తరహాలో కార్మికులే లాభాలు పంచుకునేలా ఆర్టీసీని అద్భుత సంస్థగా తీర్చిదిద్దుతానని సీఎం కేసీఆర్​ ప్రకటించారు.

TSRTC STRIKE ENDED WITH CM KCR STATEMENT
TSRTC STRIKE ENDED WITH CM KCR STATEMENT

By

Published : Nov 29, 2019, 5:15 AM IST

Updated : Nov 29, 2019, 7:09 AM IST

ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు
దాదాపు రెండు నెలలుగా ఆర్టీసీకి సంబంధించి నెలకొన్న అనిశ్చితికి సీఎం కేసీఆర్​ ప్రకటనతో తెరపడింది. ప్రగతిభవన్ వేదికగా కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్... ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. తాము ఎవరి పొట్టలు కొట్టదల్చుకోలేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గతంలోనే విజ్ఞప్తి చేసినా... యూనియన్ల మాటలు విని కార్మికులు నష్టపోయారని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని కోరిన సీఎం... కార్మికులు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు. మంత్రుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు. సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకుంటామన్నారు. ఆర్థికసాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

క్రమశిక్షణారాహిత్యాన్ని సహిచం....

ప్రభుత్వ నిర్ణయాన్ని అలుసుగా తీసుకుని క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తే కార్మికులు మళ్లీ ఇబ్బందుల్లో పడతారని కేసీఆర్​ హెచ్చరించారు. కార్మికసంఘాలను పక్కనపెట్టి తాను చెప్పినట్లు వింటే ఆర్టీసీని అద్భుత సంస్థగా తీర్చిదిద్దుతాననని ప్రకటించారు. సింగరేణి తరహాలో లాభాలు పంచుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రస్తుత నిర్ణయంతో ఆర్టీసీ సమస్య సుఖాంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి... సంస్థకు తక్షణ సాయంగా రూ.100 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు సంస్థకు అదనపు ఆదాయం వచ్చేందుకు వీలుగా ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి కిలోమీటర్​కు 20 పైసల చొప్పున ఛార్జీలు పెంచుకోవచ్చని పేర్కొన్నారు.

విపక్షాలు, యూనియన్లది అత్యుత్సాహం...

కార్మికసంఘాలు, విపక్షాల వైఖరిని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. కార్మికులను యూనియన్లు అనవసరంగా రోడ్డు పాలు చేస్తే, వాస్తవాలు చెప్పాల్సిన ప్రతిపక్షాలు... నాలుగు ఓట్ల కోసం రాజకీయ చలిమంటలు వేశాయని మండిపడ్డారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే కార్మికుల గురించి ఆలోచించారన్నారు.

లాభాల బాటలో పయనించేలా నిర్ణయాలు...

లాభాల బాటలో పయనించేలా ఆర్టీసీని అద్భుత సంస్థగా తీర్చిదిద్దేందుకు ఉమ్మడి నిర్ణయాలు తీసుకుందామని కేసీఆర్​ తెలిపారు. త్వరలోనే ప్రతి డిపో నుంచి ఐదారుగురిని పిలిపించి తానే మాట్లాడతానని చెప్పారు. ఆర్టీసీ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కార్మికులందరికీ ముద్రించి ఇస్తామని తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కూడా అవసరమన్న కేసీఆర్... ఇందుకోసం సీనియర్ మంత్రి నేతృత్వంలో కార్మికుల సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తామన్నారు.

సమ్మె సందర్భంగా తాత్కాలిక విధులు నిర్వర్తించిన వారికి సీఎం కేసీఆర్​ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్​లో వారి గురించి ఆలోచిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది

Last Updated : Nov 29, 2019, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details