ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు.. జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 11వ తేదీ వచ్చినప్పటికీ సెప్టెంబర్ నెల వేతనాలు అందకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీలో 49 వేల మంది కార్మికులు, ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి 11వ తేదీ వరకు జీతాలు రాకపోవడం ఇదే ప్రథమమని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
ఆర్టీసీలో రాబడి- వ్యయానికి మధ్య భారీ వ్యత్యాసం.. సంస్థను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోంది. నష్టాల నుంచి గట్టెక్కి గాడిన పడుతున్న సమయంలో.. లాక్డౌన్ గుదిబండలా మారింది. లాక్డౌన్కు ముందు రోజుకి రూ.12 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు అందులో సగం కూడా రావడంలేదని అధికారులు చెబుతున్నారు. వచ్చే అరకొర ఆదాయం.. ఆర్టీసీ బస్సుల డీజీల్ ఖర్చులు, వాహనాల నిర్వహణకే సరిపోతున్నాయంటున్నారు అధికారులు.