తెలంగాణ

telangana

ETV Bharat / state

సకల జనుల భేరికి పోటెత్తిన మద్దతు - TSRTC STRIKE UPADATES IN TELUGU

ఆర్టీసీ సమస్యలు పరిష్కరించకుంటే.. మిలియన్ మార్చ్, సాగరహారం తరహాలో మరో పోరాటం చేస్తామని ఆర్టీసీ జేఏసీ, విపక్షనేతలు హెచ్చరించారు. ఈ పోరాటంలో ఖచ్చితంగా విజయం సాధించి తీరుతామని నేతలు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్​ సరూర్​నగర్​లో జరిగిన సకల జనభేరి సభకు విపక్షనేతలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలతో పాటు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున హాజరై ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెలిపాయి.

TSRTC SAKALA JANA BHERI IN SAROORNAGAR HYDERABAD FULL STORY

By

Published : Oct 31, 2019, 12:02 AM IST

ఆర్టీసీ కార్మికుల భేరికి... సబ్బండ వర్గాల మద్దతు ఝరి...
ఆర్టీసీ కార్మికులకు తామంతా అండగా ఉన్నామని మనోధైర్యం కోల్పోవద్దని అఖిలపక్షనేతలు ముక్తకంఠంతో భరోసానిచ్చారు. హైదరాబాద్​ సరూర్​నగర్​లో నిర్వహించిన సకలభేరి సభకు పెద్దఎత్తున వచ్చిన జనులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. తొలుత 15 మంది అమరులకు సంతాపం ప్రకటించారు.

కార్మికులకు అన్ని పార్టీల అండ...

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని... ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలవాలని అఖిలపక్షనేతలు విజ్ఞప్తి చేశారు. సబ్బండ వర్గాలు ఆర్టీసీకి అండగా ఉన్నారన్నారు. ఆర్టీసీ నష్టాల్లో లేదని... నష్టాల్లోకి నెట్టివేయబడిందని అఖిలపక్షనేతలు ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తమ మేనిఫేస్టోలో పెట్టలేదని తెరాస నేతలు పేర్కొంటున్నారని... మరి 30శాతం అద్దెబస్సులు, 20శాతం ప్రైవేట్ బస్సులకు కేటాయించడం తెరాస మేనిఫేస్టోలో ఉందా అని ఎంపీ రేవంత్​రెడ్డి అడిగిన ప్రశ్నను కార్మికులంతా తమ నినాదాలతో బలపర్చారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే టీఎంయూ నేతలను పక్కన కూర్చోబెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడెందుకు దూరం పెడుతున్నారని విపక్షనేతలు ప్రశ్నించారు.

ఆర్టీసీని బతికించుకునేందుకే...

తమకు కావాల్సింది ఆర్టీసీ పరిరక్షణ, ప్రజారక్షణ అని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. యూనియన్లను మూసేస్తామంటున్న సీఎం కేసీఆర్.... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కోరిక తీర్చుకోవాలన్నారు. తాము బుగ్గకార్లలో తిరగడంలేదని... పదవులు అనుభవించడం లేదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల ఆధ్వర్యంలో రేపు కూనంనేని సాంబశివరాలు దీక్షను విరమింపజేస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు చర్చలకు రమ్మన్నా... సిద్దమేనని జేఏసీ నేతలు స్పష్టంచేశారు. లేదంటే మరో మిలియన్ మార్చ్​కైనా వెనకాడబోమని పేర్కొన్నారు.

సభలో అపశ్రుతి...

సకల జనభేరిలో అపశ్రుతి చోటుచేసుకుంది. సభకు వచ్చిన కరీంనగర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి బాబుకి గుండెపోటు రావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఇవీ చూడండి: ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... కోర్టుకు నివేదికపై సమాలోచనలు!

ABOUT THE AUTHOR

...view details