TSRTC special buses for Vasantha Panchami: ఈ నెల 26వ తేదీన వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. వసంత పంచమిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం 108 బస్సులను ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసరకు 88, సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌కు 20 బస్సులను ప్రత్యేకంగా బుధ, గురువారాల్లో ఈ బస్సులు తిరుగుతాయని వివరించారు.
బాసరకు వెళ్లే బస్సులు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 21, జేబీఎస్ నుంచి 12, నిజామాబాద్ నుంచి 45, హన్మకొండ నుంచి 5, కరీంనగర్ నుంచి 4, జగిత్యాల నుంచి ఒక బస్సును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. వర్గల్‌కు సికింద్రాబాద్(గురుద్వారా) నుంచి ప్రతి అరగంటకో బస్సు నడిచే విధంగా చర్యులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ గురుద్వారా నుంచి 10, జేబీఎస్ నుంచి 6, గజ్వేల్ నుంచి 2, సిద్దిపేట నుంచి 2 బస్సులను నడుపుతున్నామని వివరించారు.