ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి గతుకుల మార్గంలో ప్రయాణం చందంగా ఉంది. వరుసగా రెండు నెలలు లాభాల బాటలో నడిచి మళ్లీ నష్టాల మలుపు తిరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారీగానే నష్టాలను మూటగట్టుకోనుంది. గడిచిన ఏడాది డిసెంబరు అయిదో తేదీ నుంచి ఛార్జీల పెంపుదల అమలులోకి వచ్చింది. ఈ పెంపు ఫలితంగా ఒక ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.750 కోట్ల వరకు అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు లెక్కలు కట్టారు. కానీ లాక్‌డౌన్‌తో రెండు నెలలపాటు ఆదాయాన్ని కోల్పోయింది.
దాదాపు 56 రోజుల పాటు బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. గడిచిన కొద్ది రోజులుగా బస్సులు నడుస్తున్నా ఆక్యుపెన్సీ 45 శాతం దాటడం లేదు. ఆదాయాన్ని మిగిల్చే దూర ప్రాంత సర్వీసులను నడిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాలకు రాకపోకలపై ఉన్న ఆంక్షలను కూడా ప్రభుత్వం తొలగించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు త్వరలో బస్సులు నడిపేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అనుమతి రావటమే తరువాయి. పూర్తి స్థాయిలో కాకపోయినా పరిమిత సంఖ్యలోనైనా దూర ప్రాంతాలకు సర్వీసులు తిప్పేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కోరితే ఎలా ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.