TSRTC Reduced Advance Reservation Charges : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు.. ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలను సవరించింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ఛార్జీలను తగ్గించింది. ఈ మేరకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కిలో మీటర్ల లోపు వరకు రూ.20.. 350 కిలోమీటర్లు, ఆపై కిలో మీటర్లకు రూ.30 తగ్గిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.
TSRTC Latest News :ఈ క్రమంలోనే సూపర్‌లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే..టీఎస్‌ఆర్టీసీ రూ.30 వసూలు చేయనుంది. ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు మంచి స్పందన వస్తుందని సంస్థ వెల్లడించింది. ప్రతి రోజు సగటున 15,000 వరకు.. తమ టికెట్లను ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుంటున్నారని యాజమాన్యం తెలిపింది. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకే.. వీటిని తగ్గించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకుని.. సంస్థను ఆదరించాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సజ్జనార్‌లు కోరారు.
TSRTC New Initiative To Provide Snacks In Bus :ఇటీవలే టీఎస్ఆర్టీసీ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు.. బస్‌టికెట్‌తో పాటే స్నాక్‌బాక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ప్రయాణికుల కోసం బస్సు మధ్యలో ఎక్కువ సార్లు అపే అవసరం ఉండదని అధికారులు తెలిపారు. తొలుత హైదరాబాద్-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్ గరుడ బస్సుల్లో ప్రవేశపెట్టింది.