Facilities for passengers through TSRTC app: ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ ఎల్లప్పుడూ ముందుంటుంది. సంక్రాంతి పండగ సందర్భంగా ముందస్తుగా టికెట్ బుకింగ్ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్ వివరాలతో పాటు.. బస్సు ట్రాకింగ్ లింక్‌ను సందేశరూపంలో అధికారులు పంపిస్తున్నారు. ఆ లింక్‌పై క్లిక్ చేయగానే బస్సు ఎక్కడుందో.. ఎంత దూరంలో ఉందో ప్రయాణికులు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ట్రాకింగ్ యాప్ వివరాల ఆధారంగా బస్సు వచ్చే సమయాన్ని ప్రయాణికులు కచ్చితంగా తెలుసుకోవచ్చు.
1800 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం: ప్రస్తుతం ముందుగా రిజర్వేషన్ సౌకర్యం గల 18వందల బస్సు సర్వీస్‌లకు ట్రాకింగ్ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఈ సంక్రాంతికి ముందుస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన 600 ప్రత్యేక బస్సులకూ ట్రాకింగ్‌ను అనుసంధానం చేసింది. త్వరలోనే హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లతో పాటు మిగిలిన సర్వీస్‌లన్నింటికీ ఈ సదుపాయం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంక్రాంతికి ప్రయాణికులకు అసౌకర్యం కలగొద్దనే ఉద్దేశంతో వారి ఫోన్లకు బస్సు ట్రాకింగ్ లింక్‌ను సందేశ రూపంలో పంపిస్తున్నామన్నామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
టీఎస్ఆర్టీసీ యాప్ ఎలా పొందాలి: టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ పేరుతోనూ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ www.tsrtc.telangana.gov.in నుంచి సైతం ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివరాలు తెలపాల్సిన అవసరం లేదని యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లా సర్వీస్‌లకు సంబంధించిన సమాచారాన్ని వేర్వేరుగా సంస్థ పొందుపరిచింది.