RTC- Railway Transport: సరుకు రవాణాలో ఆర్టీసీ, రైల్వేలు కలసి సంయుక్తంగా ముందుకెళ్లనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన చేస్తోంది. టీఎస్‌ఆర్టీసీ కార్గో, పార్శిల్ విభాగంలో సమూల మార్పులు చేయడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టిసారించారు. అందులో భాగంగా కార్గో విభాగానికి వ్యాపార నిర్వహణ ఇంఛార్జ్‌గా జీవన్ ప్రసాద్‌ను నియమించారు. కొంతకాలంగా సరుకు రవాణాను పటిష్టం చేసే దిశలో దక్షిణ మధ్య రైల్వే పకడ్బందీగా వ్యవహరిస్తోంది.
ఈమేరకు వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో టీఎస్‌ఆర్టీసీతో కూడా ఒప్పందంపై ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం నిర్ధారిత స్టేషన్ల నుంచి సరుకు రవాణా అవుతోంది. ఆయా స్టేషన్ల వరకు సరుకును బుక్ చేసినవారే తెచ్చి రైల్వేకు అప్పగించాల్సి ఉంది. దీనిని భర్తీ చేసేందుకు ఆర్టీసీ ముందుకొచ్చింది. పార్శిల్స్ బుక్ చేసుకున్న వారి ఇళ్లు, వ్యాపార కేంద్రాల వద్దకు ఆర్టీసీ కార్గో సిబ్బంది వెళ్లి సరుకును తీసుకువచ్చి..అందుకయ్యే ఖర్చును వసూలు చేస్తారు.