TSRTC MD Sajjanar Fires on Bigg Boss Fans : తెలంగాణ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేస్తే ఉపేక్షించేది లేదని ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి అని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. బిగ్‌బాస్ అభిమానులు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేసిన ఘటనపై స్పందించిన సజ్జనార్, ప్రజలను సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్లేనని ఎక్స్(ట్విటర్) వేదికగా తెలిపారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదని హితవు పలికారు.
Big Boss 7 Show Telugu :బిగ్ బాస్ 7(BIGG BOSS 7) ఫైనల్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో ఆదివారం రాత్రి టీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సులపై కొందరు వ్యక్తులు దాడి చేశారని ఎండీ సజ్జనార్(Sajjanar) తెలిపారు. ఈ సంఘటనలో ఆరు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఆర్టీసీ యాజమాన్యం ఫిర్యాదు చేసిందని, బాధ్యులపై చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు వెల్లడించారు. ఆర్టీసీ ఫిర్యాదుతో ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే : జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో బిగ్‌బాస్ విన్నర్, రన్నర్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. పల్లవి ప్రశాంత్(రైతుబిడ్డ), అమర్దీప్(Pallavi Prasanth vs Amardeep) అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు అద్దాలను, పోలీస్ వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.