తెలంగాణ

telangana

By

Published : Oct 23, 2019, 5:45 AM IST

Updated : Oct 23, 2019, 7:23 AM IST

ETV Bharat / state

"విలీనం" మినహా మిగతా డిమాండ్ల పరిశీలనకు కమిటీ

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను వదులుకున్నందున మిగతావాటిని పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు ప్రస్తావించిన 21 డిమాండ్లపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఆర్టీసీ ఎండీ నియంమించారు. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

'విలీనం' వదులుకున్న కార్మికులు... డిమాండ్ల పరిశీలనకు కమిటీ

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్లను పరిశీలించడానికి ఆర్టీసీ ఈడీలతో కమిటీని ఆర్టీసీ ఎండీ ఏర్పాటు చేశారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రగతి భవన్​లో అధికారులతో సమీక్ష జరిపారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్మ, నర్సింగ్ రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్ సుల్తానియా, ఈడీలు పాల్గొన్నారు.

21 అంశాల పరిశీలన

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తేనే చర్చలు జరుపుతామని కార్మిక సంఘాల నాయకులు మొదట ప్రకటించారు. అదే తమ ప్రథమ డిమాండ్​ అని చెప్పారు. కానీ హైకోర్టులో విచారణ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీదనే పట్టుపట్టబోమని చెప్పారు. కార్మిక సంఘాల తరుఫున కోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమనే డిమాండ్ నెరవేరితే తప్ప చర్చలకు రామని కార్మికులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. విలీన డిమాండ్ ఒక్కటే ప్రధానం కాదని వారి న్యాయవాది చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్ వదులుకున్నట్లయింది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఆ డిమాండ్లు పరిశీలించాలి. దానికోసం అధ్యయనం చేయండని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్టీసీ ఎండీగా వ్యవహరిస్తోన్న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ వేశారు. ఈడీ టి.వెంకటేశ్వర్ రావు అధ్యక్షుడిగా ఈడీలు ఎ.పురుషోత్తం, సి.వినోద్ కుమార్, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్.రమేశ్​ సభ్యులుగా కమిటీ ఏర్పడింది. హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండీకి అందిస్తుంది.

భాజపా, కాంగ్రెస్‌ చేస్తున్నాయా?

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. తక్షణం వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రోద్భలంతో చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్, భాజపా మద్దతు పలకడం అనైతికమని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణలో కార్మికులు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని సీఎం ప్రశ్నించారు.
ఆర్టీసి విషయంలో కాంగ్రెస్, భాజపా చేస్తున్న వాదనలు విచిత్రంగా ఉన్నాయి. ఆర్టీసీని, రూట్లను ప్రైవేటుపరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం, అవకాశం కల్పిస్తూ మోదీ ప్రభుత్వం చట్టం చేసిందని... దానికి వ్యతిరేకంగా ఇక్కడి భాజపా నాయకులు మాట్లాడుతున్నారన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని మూసేసిందని తెలిపారు. కానీ ఆ పార్టీలు తెలంగాణ విషయంలో మాత్రం విచిత్రంగా, విభిన్నంగా మాట్లాడుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

చట్టానికి లోబడే...

1950లో జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు రూపొందించిన మోటార్ వెహికిల్ యాక్టు ప్రకారమే రాష్ట్రాల్లో ఆర్టీసీలు ఏర్పడ్డాయి. ఆర్టీసీ వాహనాలు నడిచే రూట్లలో ప్రైవేటు వాహనాలకు అనుమతులు ఇవ్వవద్దని కూడా చట్టంలో పేర్కొన్నారు. ఆ చట్టంలోని 3వ సెక్షన్‌ సవరించి నరేంద్ర మోదీ ప్రభుత్వం మోటార్‌ వెహికల్‌-2019 చట్టం చేసింది. ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టం అమలుకు ప్రయత్నిస్తుంటే తెలంగాణ భాజపా నాయకులు రాద్దాంతం చేస్తున్నారని... ఉపరితల రవాణాశాఖ మంత్రి లేఖ రాయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

'విలీనం' వదులుకున్న కార్మికులు... డిమాండ్ల పరిశీలనకు కమిటీ

ఇదీ చూడండి: 'ముట్టడి'పై కాంగ్రెస్‌ సీనియర్ల సీరియస్‌

Last Updated : Oct 23, 2019, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details