మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా మారింది ఆర్టీసి పరిస్థితి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాక్‌డౌన్‌తో మరింత కష్టాల్లో కూరుకుపోయింది. లాక్‌డౌన్‌తో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. వచ్చే ఆదాయం డీజీల్‌కు, వాటి నిర్వాహణకు మాత్రమే సరిపోతుంది. కరోనా నేపథ్యంలో సగం బస్సులనే నడిపిస్తున్నారు. ఇది కూడా ఆర్టీసీ నష్టాలకు మరో కారణమవుతుంది.
కరోనా ఎఫెక్ట్: ఆర్టీసీ బండి... నష్టాలు దండి
By
Published : Aug 26, 2020, 3:46 AM IST
రాష్ట్రంలో 9,600ల ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కరోనాకు ముందు ఇవి రోజుకు 35లక్షల కిలోమీటర్లు ప్రయాణించేవి. కానీ..కరోనా తర్వాత కేవలం 3వేల బస్సులను సుమారు 12 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిప్పుతున్నారు. కొవిడ్ -19 లాక్డౌన్ తర్వాత ప్రజారవాణా బస్సులకు అనుమతి వచ్చినప్పటికీ..అంతరాష్ట్ర సర్వీసులు, గ్రేటర్లో బస్సులు తిప్పడంలేదు. దీనివల్ల సంస్థకు వచ్చే ఆదాయానికి, ఖర్చులకు భారీగా వ్యత్యాసముంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా ప్రభావంతో...
వేసవి సెలవులు, పండుగ రోజుల్లో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడేవి. కానీ..కరోనా నేపథ్యంలో సెలవులు, పండుగల గిరాకీని ఆర్టీసీ కోల్పోయింది. భారీగా లాభాలు వచ్చే సమయంలోనే బస్సులు నడవలేదు. ఇది కూడా నష్టానికి కారణంగా పేర్కొంటున్నారు. ఆర్టీసీకి నష్టాలు వచ్చేందుకు మరో ప్రధాన కారణం...ఇంధన ధరలు భారీగా పెరగడమే అని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. డీజీల్ ధరలు ఎక్సైజ్ పన్నుతో కలిపి సుమారు రూ.16 వరకు పెరిగిపోయిందని ఆ భారం కూడా సంస్థపైనే పడుతుందని కార్మిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కార్మిక నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. డీజీల్‌పై ఎక్సైజ్ పన్ను ఎత్తివేయాలని కోరుతున్నారు.