RTC Decision to Give Kalyanotsava Talambras of Sri Sitaram To devotees: శ్రీరామ నవమి సందర్భంగా.. భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే.. ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాముల వారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు ఆర్టీసీ సన్నద్దమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు.. టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం తెలియజేసింది.
బుకింగ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎండీ సజ్జనార్: శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అనంతరం.. ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుందని ఆర్టీసీ పేర్కొంది. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో ఇవాళ భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. అనంతరం.. లాజిస్టిక్స్ బీజినెస్ హెడ్ పి.సంతోశ్ కుమార్‌కు రూ.116 చెల్లించి, రశీదును ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ స్వీకరించారు.
దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తొలి బుకింగ్ చేసుకుని తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉందని, నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా కల్యాణంలో ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని గత ఏడాది టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించిందన్నారు.