TSRTC Bus Officers in Villages: శతాబ్దానికి చేరువయ్యే చరిత్ర.. సురక్షిత ప్రయాణం.. ఉన్నతమైన ప్రమాణాలతో ప్రయాణికుల ఆదరాభిమానాలు చూరగొన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. ఆధునిక విధానాలు, సరికొత్త ఒరవడితో సేవలను అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటికే కార్గో లాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న టీఎస్ఆర్టీసీ.. తాజాగా మరో వ్యవస్థ ఏర్పాటుకు సిద్ధమైంది. అదే విలేజ్ బస్ ఆఫీసర్ల నియామకం. ఆర్టీసీని ప్రజల చెంతకు తీసుకువెళ్లేందుకు గ్రామాల్లో వీరిని నియమించాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జారీ చేశారు.
మే 31 నుంచి అమల్లోకి: ఈ వ్యవస్థ మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పిన ఆయన.. వీలైనంత త్వరగా బస్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. గ్రామాల్లో నివసించే ఆర్టీసీలో పని చేసే కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్ బస్ ఆఫీసర్లుగా డిపో మేనేజర్లు నియమిస్తారు. ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలుండి.. స్వచ్ఛందంగా పని చేసేందుకు ముందుకు వచ్చే వారికి నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.పెద్ద గ్రామానికైతే ఒకే బస్ ఆఫీసర్ ఉండనున్నారు. చిన్న గ్రామాలైతే రెండు, మూడింటికి కలిపి ఒకరిని నియమిస్తారు.
గ్రామస్థులతో నిత్యం అందుబాటులో ఉంటారు: ఈ మార్గదర్శకాల ప్రకారం ఒక్కరికి 5 గ్రామాల కంటే ఎక్కువగా కేటాయించేందుకు అవకాశం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. హైదరాబాద్ సహా మిగతా పురపాలికల్లోనూ వార్డుకో బస్ ఆఫీసర్‌ను అధికారులు నియమించనున్నారు. వారు ఆయా వార్డుల పరిధిలో విలేజ్ బస్ ఆఫీసర్లలాగే పని చేస్తారు. వీరంతా గ్రామస్థులకు నిత్యం అందుబాటులో ఉండనుండగా.. 15 రోజులకోసారి వారితో సమావేశమవుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్‌లు, కొత్త సర్వీస్‌లు, సమస్యలు, ఇతర అంశాల గురించి సమాచారాన్ని సేకరించి.. పైఅధికారులకు చేరవేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో వివాహాలు, శుభకార్యాలు, జాతరల వివరాలను ముందే అధికారులకు తెలియజేసి.. రద్దీ ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్టుగా సేవలను పెంచే అవకాశం ఉంటుంది. ఆయా సందర్భాల్లో జనం ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ అద్దె బస్సులను ఉపయోగించుకోవాలని ప్రజలకు వివరిస్తారు.