తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్శిల్‌ సర్వీసులపై మరింత దృష్టిసారించిన ఆర్టీసీ

సంస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకమే పెట్టుబడిగా... ఆర్టీసీ ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే లాభాలు గడించిపెడుతున్న కొరియర్‌, పార్శిల్‌ సేవలు మరింత విస్తరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఖర్చులు తగ్గించడంతోపాటు... పొరుగు సేవల సిబ్బందిని వినియోగించుకుంటూ లాభాలు గడించే దిశగా... సంస్థ ప్రణాళిక రూపొందిస్తోంది.

tsrtc cargo services, tsRTC parcel services
పార్శిల్‌ సర్వీసులపై మరింత దృష్టిసారించిన ఆర్టీసీ

By

Published : Apr 4, 2021, 5:40 PM IST

ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసు సేవలను మరింత విస్తరిస్తోంది. ఇదే సమయంలో ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం 177 బస్టాండ్లలో పార్శిల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 140 బస్టాండ్లలో ఆర్టీసీ సిబ్బందికి బదులు పొరుగు సేవలు వినియోగించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో బస్సులు నడుస్తుండటం వల్ల ఆర్టీసీ సిబ్బందితో పార్శిల్‌ సేవలు నడిపించే పరిస్థితి లేదు. దీనికి తోడు ఖర్చుల భారమూ తగ్గుతుందని భావిస్తోంది. మిగిలిన 37 బస్ స్టేషన్లలోనూ మానవ వనరులను తగ్గించాలని ఆలోచన చేస్తోంది.

హోం డెలివరీ సౌకర్యం

కొరియర్‌, పార్శిల్‌ సేవలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు... ఆర్టీసీ 26 లక్షల పార్శిళ్లు చేరవేసింది. కార్గో, పార్శిళ్లతో కలిపి ఆర్టీసీకి 33 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వినియోగదారుల నుంచి హోం డెలివరీ చేయాలనే విజ్ఞప్తి మేరకు.. 64 పట్టణ ప్రాంతాల్లో సేవలు ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అందుకు రెండు ఏజెన్సీలు ముందుకు వచ్చాయని యాజమాన్యం తెలిపింది. వచ్చే వారంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో లాజిస్టిక్ శాటిలైట్ బిల్డింగ్ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కమర్షియల్ పార్శిళ్లూ సరఫరా చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. కస్టమ్స్, క్వాలిటీ క్లియరెన్స్‌ను ఏజెంట్లే చేసుకుంటారని వెల్లడించారు. వీటితోపాటు 54 పార్శిల్ కేంద్రాల్లో సాంకేతికత మెరుగు పరుస్తున్నట్లు పేర్కొన్నారు.

కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించడంతోపాటు... ఆర్టీసీకి లాభాల పంట పండేలా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది.



ఇదీ చూడండి :ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా​

ABOUT THE AUTHOR

...view details