TSRTC income: రాష్ట్రంలో రోజువారీ ఆదాయం రికార్డులను తెలంగాణ ఆర్టీసీ తిరగరాసింది. రాఖీపౌర్ణమి రోజున రికార్డుస్థాయి ఆదాయాన్ని ఆర్జించింది. ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజు ఆదాయం రూ.20కోట్లు దాటింది. ఆక్యుపెన్సీలోనూ రికార్డు సృష్టించింది. సంస్థ సాధారణ రోజువారీ ఆదాయంగా రూ.15.59 కోట్ల లక్ష్యాన్ని అధికారులు నిర్దేశించారు. రకరకాల ఛార్జీల పెంపుతో ఇటీవల రోజువారీ ఆదాయం రూ.13కోట్లు దాటుతోంది.
సోమవారాల్లో ఆ లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమిస్తోంది. మామూలు రోజుల్లో రూ.13 నుంచి 15కోట్ల వరకు సమకూరుతుంది. తెలంగాణలో రాఖీపౌర్ణమికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక్క రోజులోనే ఆర్టీసీ ఆదాయం రూ.20.11కోట్లు లభించటం విశేషం. ఆర్టీసీ చరిత్రలో ఇది అపూర్వమని అధికారులూ చెబుతున్నారు. టీఎస్‌ఆర్టీసీ పరిధిలోని కరీంనగర్ జోన్‌లో అత్యధికంగా 8.79 కోట్లు, హైదరాబాద్ జోన్‌లో రూ.5.85 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో రూ.5.47 కోట్ల వంతున ఆదాయం లభించింది.