TSRTC Electric Buses in Hyderabad : హైదరాబాద్ మహానగర ప్రయాణికులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను.. టీఎస్ఆర్టీసీ( TSRTC Electric Buses) అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందుకోసం నగరంలో 1,300 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించింది. అందులో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం సంస్థ ఆర్డర్ ఇచ్చింది. వాటిలో 500 బస్సులను.. హైదరాబాద్ సిటీలో.. మరో 50 బస్సులను విజయవాడ మార్గంలో నడపాలని నిర్ణయించింది.
ఇప్పటికే విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్‌లో తొలి దశలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయి. వచ్చే నెల రెండో వారంలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. అందులో 20 బస్సులను శంషాబాద్ విమానాశ్రయానికి.. మరో ఐదు బస్సులను ఐటీ కారిడార్‌కు తిప్పాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత రెండు వారాలకు మరో 25 కూడా అందుబాటులోకి వస్తాయని.. వాటిని కూడా ఈ రెండు మార్గాల్లోనే తిప్పాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు.
ఈ ఆర్థిక ఏడాదిలో సిటీలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి వస్తున్నాయి. అందులో 50 ఏసీ బస్సులుండగా.. అందులో సుమారు 120 వరకు ఎలక్ట్రికల్ ఆర్డినరీ బస్సులు, సుమారు 330 వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉంటాయని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో విడతల వారీగా వీటిని టీఎస్‌ఆర్టీసీకి ఒలెక్ట్రా అందజేయనుంది. వీటికి తోడు సిటీలో మరో 800 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.
ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 12 మీటర్ల పొడవుతో.. హైటెక్ హంగులతో అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిలో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు సీట్ బెల్ట్ సదుపాయం కూడా ఉంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ కూడా ఉంటుంది.
బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా.. రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. గమ్యస్థానాల వివరాలు కోసంబస్సులో నాలుగు ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు వీటిలో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్)ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని చెప్పారు. ఫుల్ చార్జింగ్కు 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుందని వివరించారు. మరోవైపు ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు.
TSRTC Conducting Survey in Hyderabad : హైదరాబాద్‌లో తిప్పనున్న ఎలక్ట్రిక్ బస్సుల కోసం కొత్త రూట్ల కోసం.. టీఎస్ఆర్టీసీ ఓ అన్లైన్ సర్వేను రూపొందించింది. సర్వేలో ప్రయాణికులు, చిరువ్యాపారులు, ఉద్యోగులు, వివిధ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు.. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవారు తమ అవసరాలను టిక్ రూపంలో పూర్తిచేసే వెసులుబాటు కల్పించింది. ఈ సర్వేలో ప్రయాణికుల పేరు, జెండర్, ఉద్యోగం చేస్తున్న సంస్థలు, ఇతర ప్రదేశాల పేర్లు ఉంటాయి. మరోవైపు వారు ఇప్పుడు గమ్యస్థానాలకు చేరుకోవడానికి వినయోగిస్తున్న రవాణా సాధనాల గురించిన వివరాలను ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.
మరోవైపు ఏ సమయంలో మీరు కార్యాలయాలకు వెళతారు.. అక్కడి నుంచి ఎన్నింటికి బయలుదేరుతారు.. మీకు రవాణాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనే అంశాలు ఉంటాయి. ప్రజారవాణా మీ ప్రాంతంలో అందుబాటులో లేదా, ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీ లేదా, రక్షణ విషయంలో ఇబ్బందులు ఉన్నాయా.. మీరు ఎక్కడా ఆపకుండా ఉండేవిధంగా అందుబాటులో ఉండే ప్రీమియం సర్వీసులు కోరుకుంటున్నారా..? తదితర అంశాలను టీఎస్ఆర్టీసీ సర్వేలో పొందుపరిచింది. వీటితో పాటు ప్రయాణికులు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నారు ఆయా ప్రదేశాలకు సంబంధించిన వివరాలను కూడా అందుబాటులో ఉంచారు.
సర్వే జరిగే ప్రాంతాలు..
- హైదరాబాద్ వెస్ట్ - మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, లింగంపల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల తదితర ప్రాంతాలు..
- హైదరాబాద్ నార్త్- కొంపల్లి, అల్వాల్, తిరుమలగిరి, సుచిత్ర, విక్రంపురి తదితర ప్రాంతాలు..
- హైదరాబాద్ నార్త్ వెస్ట్- బాలానగర్, కూకట్పల్లి, మియాపూర్, కేపీహెచ్‌బీ, చందానగర్ తదితర ప్రాంతాలు..
- హైదరాబాద్ నార్త్ ఈస్ట్- సఫిల్‌గూడ, ఈసీఐఎల్, రాంపల్లి, మల్కాజ్గిరి, మల్లాపూర్ తదితర ప్రాంతాలు..
- హైదరాబాద్ సౌత్- కాటేదాన్, శంషాబాద్, ఓల్డ్‌సిటీ, తుక్కుగూడ తదితర ప్రాంతాలు..
- హైదరాబాద్ సౌత్ ఈస్ట్- దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాలు..
- హైదరాబాద్ ఈస్ట్- ఉప్పల్, ఘట్కేసర్, హబ్సిగూడ, నాగోల్, రామాంతపూర్ తదితర ప్రాంతాలు..
- హైదరాబాద్ సెంట్రల్ - హిమాయత్‌నగర్, ముషీరాబాద్, బేగంపేట్, ఖైరతాబాద్, మెహదీపట్నం, బంజారాహిల్స్, మలక్‌పేట, నల్లకుంట, అంబర్పేట్ తదితర ప్రాంతాలు.. వీటితో పాటు ఇతర ప్రాంతాల ఆప్షన్ కూడా ఇచ్చారు.
ప్రజలు తమకు కావాల్సిన వాటిని పూర్తి చేస్తే.. మెజారిటీ ప్రజల అభిప్రాయల ప్రకారం కొత్త రూట్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సర్వే వల్ల ప్రయాణికులకు అవసరమైన రూట్లను అందుబాటులోకి తీసుకురావచ్చని అంచనావేస్తున్నారు. అదేవిధంగా ప్రయాణికులు అవసరం లేదనకుంటే .. ఆ మార్గాల్లో బస్సులను తగ్గించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల ప్రయాణికులకు సౌకర్యాలు, ఆర్టీసీకి సరైన చోటుకు బస్సులను నడిపించే వెసులుబాటు కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో తొలిసారిగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులు.. ఎప్పటినుంచంటే..!
అందుబాటులోకి TSRTC ఉచిత వైఫై ఏసీ స్లీపర్ బస్సులు.. ప్రైవేట్ బస్సులకు దీటుగా..!