MD Sajjanar on mega blood donation camp: కొవిడ్ సమయంలో ఏర్పడిన రక్త కొరతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రేపు అన్ని ఆర్టీసీ బస్ డిపోల్లో మెగా రక్తదాన కార్యక్రమం(blood donation camp at all depots) చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రహరీ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
వారికి ఉచిత ప్రయాణం
రేపు రక్తదానం చేసేవారికి ఒక్కరోజు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్(tsrtc md sajjanar) స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రక్తదానం చేయండి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం, ప్రహరీ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డోనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని ఆర్టీసీ బస్ డిపోల్లో ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరుతున్నా. కొవిడ్ సమయంలో చాలామంది రక్తం కొరత వల్ల ఇబ్బందులు పడ్డారు. చిన్న పిల్లలకు, గర్భణీ స్త్రీలకు, క్యాన్సర్, తలసేమియా రోగులకు రక్తం అవసరం చాలా ఉంది. అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నా.
- సజ్జనార్, టీఎస్ఆర్టీసీ ఎండీ
కుటుంబ సభ్యులతో ఎండీ ప్రయాణం
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. సుఖవంతం అంటున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆయన తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఆర్టీసీ బస్సులో(tsrtc md sajjanar journey with family in bus) ప్రయాణించారు. అంతేకాకుండా ఎంతో సంతోషంగా పాటలు పాడుకుంటూ పులకించిపోయారు. ఇప్పుడు ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా ఎండీ సజ్జనార్ పంచుకున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి.. సంస్థ అభివృద్దికి దోహదపడండి అంటూ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన విధుల్లోనూ ప్రత్యేకతను చూపుతున్నారు. ప్రజారవాణాను గాడిలో పెట్టేందుకు వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. సామాన్యుల్లాగే తానూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు.. టీఎస్ఆర్టీసీ ప్రజలకు దగ్గరయ్యేలా సజ్జనార్ విశేషంగా కృషి చేస్తున్నారు.