TSRTC City Bus Tickets Discount Suspended in Hyderabad :గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సుల్లో తిరిగే ప్రయాణికులకు, నూతన ఏడాది వేళ టీఎస్‌ఆర్టీసీ షాక్ ఇచ్చింది. ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో పూర్తి టికెట్ ధరతో ప్రయాణించాల్సి ఉంటుంది. కొద్దివారాల క్రితం వరకు రహదారులపై ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఎదురుచూసింది. బస్సుల్లో సీట్లు నిండటం కోసం ఫ్యామిలీ-24 (TSRTC Family 24 tickets), టీ-6 రాయితీ టికెట్లను ప్రవేశపెట్టడం వంటి పలు ప్రయోగాలకు తెరదీసింది.
Hyderabad City Bus Tickets Discount Suspended :కానీ ఇప్పుడు మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక, ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా నెలకొంది. ఇప్పుడు ప్రయాణికులే బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్ (ఆక్యుపెన్సీ రేషియో) 69 నుంచి 89కి అంటే 20 శాతం పెరిగింది. ప్రయాణికుల నుంచి ఎదురుచూపులతో ఆర్టీసీకి డిమాండ్ పెరిగింది. దీంతో ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది.
పురుషుల కోసం టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు- సీనియర్ సిటిజన్లకే తొలి ప్రాధాన్యం
ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల జారీకి కండక్టర్లకు సమయం పడుతోందని, అందుకే ఈ టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) తెలిపారు. ఈరోజు నుంచి ఈ టికెట్ల జారీ ఉండదని స్పష్టంచేశారు. ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్ చూడాలని, వారి వయసు నమోదుచేయాల్సి ఉంటుదని వివరించారు. దీంతో ఈ టికెట్ల జారీ సమయం కూడా పెరుగుతోందని చెప్పారు. అందుకే ఉపసంహరిస్తున్నామని సజ్జనార్ వెల్లడించారు.